టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. మరింత మెరుగైన స్థాయికి చేరుకుంటుందనుకుంటే తాను పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమని అన్నారు. పీసీసీ వదులుకుంటే పార్టీ అధికారంలోకి వస్తుందంటే తాను రాజీనామా చేసేందుకు వెనుకాడబోనని పేర్కొన్నారు.
పార్టీ ఏం ఆదేశించినా తాను సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని తెలిపారు. పదవిలో ఉన్నా లేకున్నా తాను పార్టీ కోసం కట్టుబడి పని చేస్తానని వెల్లడించారు. పార్టీ కోసం అవసరమైతే పదవులతో పాటు ప్రాణాల్ని త్యాగం చేయడానికి కూడా తాను సిద్ధమేనన్నారు. పార్టీ శిక్షణా తరగతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో చిన్న గొడవలు ఉండటం సహజమేనన్నారు.
పది పనులు చేసే క్రమంలో కొన్ని సార్లు తప్పులు దొర్లుతాయన్నారు. మనమంతా మానవమాత్రులమేనని కార్యకర్తలతో ఆయన అన్నారు. అందువల్ల నేతలు సర్ధుకు పోవాలని ఆయన సూచించారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలని తాను అనుకోలేదన్నారు. సీనియర్ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, సంపత్ సూచనలను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.
జానా రెడ్డి సూచనల మేరకు పార్టీని రాష్ట్ర నలుమూలల్లో ముందుకు తీసుకువెళ్దామని కోరారు. అపోహాలు ఉంటే ఈ ఏడాదిలో వాటిని తొలగించుకుందామని సూచించారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు వద్దామని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌లో ఏపీ నేతల చేరికలపై ఆయన స్పందించారు. ఏపీలో తల మాసిన కొందరిని కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారంటూ మండిపడ్డారు.
డీజీపీ, చీఫ్ సెక్రటరీలను బిహారీలను నియమించి కేసీఆర్ ఏం సందేశం ఇస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. ఆంధ్రా వాళ్ళు కూడా ఇంత దారుణంగా తెలంగాణ ఆత్మ గౌరవంపై దెబ్బ కొట్టలేదన్నారను. అందుకే కార్యోన్ముఖులమై కదులుదామని పిలుపునిచ్చారు. ఉప్పెనలా కేసీఆర్ కుటుంబాన్ని కప్పేద్దామన్నారు.