తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకేష్ అంతిమయాత్రకు వరంగల్ వెళ్తుండగా ఘట్ కేసర్ టోల్ గేట్ వద్ద ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డిన పోలీసు స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ.. తాను పోలీస్ స్టేషన్ కు రానంటూ.. ఏం తప్పు చేశానని తనను అడ్డకుంటున్నారని ప్రశ్నిస్తూ.. టోల్ గేట్ వద్ద తన వాహనంలోనే నిరీక్షిస్తున్నారు రేవంత్. దీంతో ఆయన కారు కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు.
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీస్ కాల్పుల్లో చని పోయిన రాకేష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వరంగల్ బయలు దేరి వెళ్తున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి అక్కడకు వెళితే ఉద్రిక్తత చోటు చేసుకుంటుందని భావించిన పోలీసులు మార్గ మధ్యంలోనే అడ్డకున్నారు.
శాంతి భద్రతల దృష్ట్యా రేవంత్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాకేష్ అంత్యక్రియల్లో పాల్గొంటే రాని ఉద్రిక్తత.. తాను వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఉద్రిక్తత తలెత్తుందా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
రాకేష్ ను చంపింది టీఆర్ఎస్ అయితే.. చంపించింది బీజేపీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ వెళ్లి రాకేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి.. ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తే పోలీసులకు వచ్చే ఇబ్బంది ఏంటని నిలదీశారు. టీఆర్ఎస్ మంత్రులు గులాబీ జెండాలు కట్టుకొని రాకేష్ శవ యాత్రలో పాల్గొంటే లేని ఇబ్బంది.. తాము పాల్గొంటే ఏముందని ప్రశ్నించారు.
Advertisements
చావులను కూడా టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి. వరంగల్ వెళ్తున్న తనను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని నిలదీశారు. ప్రజలు కూడా అన్ని చూస్తున్నారు.. వారిని ఇంకా ఎక్కువ కాలం మోసం చేయలేరు అని వ్యాఖ్యానించారు. త్వరలో సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లేరేషన్ ప్రకటిస్తామన్నారు. నా పార్లమెంట్ నియోజకవర్గంలో నేనే పర్యటిస్తుంటే నన్ను అడ్డుకోవడం ఏంటి అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.