టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన ఇంటి దగ్గర నుంచి గోల్కొండ పీఎస్ కు తరలించారు. అంతకుముందు రేవంత్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది.
వరుసగా రెండోరోజు కూడా రేవంత్ ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. బయటకు వెళ్లడానికి వీలు లేదని అడ్డుకున్నారు. పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పినా వినలేదు పోలీసులు.
రేవంత్ రెడ్డి మాత్రం బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే.. అరెస్ట్ చేయకుండా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సమయంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు రేవంత్. ఇటు బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్ల ముందు ధర్నాలకు రేవంత్ పిలుపునివ్వడంతో అప్రమత్తమై ముందస్తు అరెస్ట్ లు చేశారు. ముఖ్య నేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. తాజాగా రేవంత్ ను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.
రేవంత్ అరెస్ట్ పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇది అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం నిర్బంధకాండ అమలవుతోందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలకు మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు.