తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన హెడ్ మాస్టర్ జేతురాం నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాలనుకున్న ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అసలు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. తన అనుమతి లేకుండా ఇంటి గోడలు దూకి పోలీసులు ఎలా వస్తారని నిలదీశారు. కేసీఆర్ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతలను ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నందుకు.. దానికి నిరసనగా మంత్రులను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్. పోలీసులను ప్రైవేట్ సైన్యంలా కేసీఆర్ మార్చుకున్నారని ఆరోపించారు. ‘‘ఎంతమందిని అరెస్ట్ చేస్తారో, ఎన్ని జైళ్లలో పెడతారో చూద్దాం. కేసీఆర్ తమాషా అనుకుంటున్నారు.. బలుపు, అహంభావంతోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిక్కరేగితే జైల్ బరో నిర్వహిస్తాం. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడుతాం’’ అంటూ కేసీఆర్ ను హెచ్చరించారు రేవంత్.
స్థానికులు, స్థానికేతరుల అంశంపైనే తెలంగాణ ఉద్యమం నడిచిందన్న రేవంత్.. బదిలీలతో ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. సొంత జిల్లాను కాదని ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేరే జిల్లాలకు బదిలీ చేయడం కరెక్ట్ కాదన్నారు. సొంత జిల్లా వాళ్లు స్థానికేతరులు ఎలా అవుతారని.. బడిలో పాటలు చెప్పే టీచర్లు రోడ్లు ఎక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. 317 జీవో వల్ల మహబూబాబాద్ జిల్లాకు చెందిన హెడ్ మాస్టర్ జేతురాం నాయక్ ఆత్మహత్య చేసుకున్నారని.. సొంత జిల్లాకు కాకుండా ఆయన్ను ములుగు జిల్లాకు బదిలీ చేయడంతో ఆవేదనతో సూసైడ్ కు పాల్పడ్డారని వివరించారు. జేతురాం నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళదామంటే తన ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులు చుట్టుముట్టారని చెప్పారు. చనిపోయింది ఉపాధ్యాయుడు, మావోయిస్టు కాదన్న రేవంత్… బాధిత కుటుంబాన్ని పరామర్శించే సోయి కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డికి లేదా? అని నిలదీశారు.