గవర్నర్ తమిళిసై రాజకీయ నాయకురాలిగా మారారని కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శుక్రవారం కరీంనగర్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య కుదిరిన రాజకీయ ఒప్పందలో భాగంగానే గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
నిర్ణయం తీసుకోవాల్సిన రోజున గవర్నర్, గవర్నమెంట్ ఇద్దరూ ఒక్కటి అవుతున్నారని.. ఆ తర్వాత రోజుల్లో పొలిటికల్ డ్రామాకు తెరలేపుతున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ వేరు వేరు కాదన్నారు. అధికారులు గవర్నర్ మాట వినకుంటే.. ఆమె అధికారులందరినీ పిలిచి సమీక్ష నిర్వహించవచ్చు కదా అని వ్యాఖ్యానించారు.
ఒకవేళ గవర్నర్ మాట అధికారులు వినకుంటే.. అలాంటి వారిపై డీవోపీటీకి రికమెండ్ చేసే అధికారం గవర్నర్ కు ఉందన్నారు. అలా రికమెండ్ చేస్తే సీఎస్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.
పాదయాత్రలపై స్పందించిన రేవంత్ రెడ్డి నేతలంతా పాదయాత్రలు చేయాల్సిందే అన్నారు. ఉత్తమ్ మహేశ్వర్ రెడ్డి ఎవరు చేసినా అవన్నీ హథ్ సే హాథ్ జోడో యాత్రలే అన్నారు. పాదయాత్రలు చేయని నాయకులపై పార్టీ చర్యలు ఉంటాయన్నారు.