– ఇందిరాగాంధీ విగ్రహానికి టీఆర్‌ఎస్ జెండాలేంటి?
– ప్రజా సమస్యలు వదిలేసి ఫ్లెక్సీ పంచాయితీలెందుకు?
– మోడీకి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే అర్హత లేదు
– కేటీఆర్ అంత చిల్లర వ్యక్తిని ఎక్కడా చూడలేదు
– 8 ఏళ్లుగా కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు నిలదీయలేదు
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ ఫైర్
వారం రోజులుగా ప్రజా సమస్యలను గాలికొదిలేసి టీఆర్ఎస్, బీజేపీ చిల్లర రాజకీయాలకు తెర తీశాయని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కల్లు కంపౌండ్ లో కల్తీ కల్లు తాగినట్లుగా నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మీడియాతో మాట్లాడారు రేవంత్. కార్పొరేట్ కంపెనీల పైసలతో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని.. ఎనిమిదేళ్లుగా హామీల విషయంలో కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే.. 16 నెలలు కేసీఆర్ కన్నెత్తి చూడలేదన్నారు. జీఎస్టీ ద్వారా జరిగిన అన్యాయంపై ప్రశ్నించలేదని.. పునర్విభజన చట్టం, మోడీ ఇచ్చిన హామీలను ప్రశ్నించడంలో కేసీఆర్ కు అవకాశం ఉన్నా వదిలేశారని మండిపడ్డారు. సమస్యల పట్ల చర్చ జరగకుండా ప్లెక్సీ లతో చిల్లర తగాదాలు తెరపైకి తెస్తున్నారని ఫైరయ్యారు. కేటీఆర్ అంత చిల్లర వ్యక్తిని భూప్రపంచంలో చూడలేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే అవకాశాలను జారవిడిచారని.. సికింద్రాబాద్ లో అగ్నిపథ్ విషయంలో జరిగిన కాల్పులు ఎవరు చేశారనేది స్పష్టం చేయలేదని చెప్పారు. లోపభూయిష్టంగా ఉన్న అగ్నిపథ్ పథకంపై మోడీని నిలదీయాలన్నారు.
ఇందిరాగాంధీ విగ్రహానికి నేరుగా టీఆర్ఎస్ జెండాలు కట్టడాన్ని ఏం రాజకీయం అంటారని ప్రశ్నించారు రేవంత్. శుక్రవారం కట్టిన వాటిని తొలగిస్తే.. శనివారం మళ్లీ కట్టారని ఫైరయ్యారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం దేనికి సంకేతమన్నారు. తెలంగాణకు అన్యాయం చేయడానికి బీజేపీ పెద్దలు వచ్చారని విమర్శించారు. తల్లిని చంపి పిల్లను బతికించారంటూ చులకన చేశారని.. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి చిల్లి గవ్వ ఇవ్వలేదన్నారు.
తెలంగాణ ఏర్పాటును శంకించిన మోడీకి ఈ గడ్డపై అడుగు పెట్టే అర్హత లేదని.. ఆ పార్టీ నేత ముఖ్యమంత్రి అయినా చేసేదేం లేదని విమర్శలు చేశారు. తప్పును తప్పు అని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా? ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోకపోతే.. కేసీఆర్, కేటీఆర్ ల వీపులకు కాంగ్రెస్ జెండాలు కడుతామని హెచ్చరించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల వద్ద మరోసారి ఇలాంటివి చేస్తే టీఆర్ఎస్ నేతల మెడలకు కడతామన్నారు రేవంత్ రెడ్డి.