ఓవైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా.. ఇంకోవైపు ప్రచారంలో దూకుడు మీదుంది కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభ్యర్థి స్రవంతితో పాటు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తాజాగా మర్రిగూడెం మండలంలో ప్రచారం నిర్వహించారు. లంకెలపల్లి, దామర భీమనపల్లి, శివన్నగూడెం, అంతంపేట, గట్టుప్పల్ గ్రామాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.
పాలకుల నిర్లక్ష్యంతోనే మునుగోడు అభివృద్ధి కుంటుపడిందని పాల్వాయి స్రవంతి అన్నారు. రాజగోపాల్ సొంత ప్రయోజనాల కోసం బీజేపీలో చేరారని ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ క్యాడర్ మొత్తం తనతోనే ఉందని తెలిపారు. పాల్వాయి బిడ్డగా తనకు ప్రజల నుండి మంచి ఆదరణ వస్తుందని.. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు ట్విట్టర్ లో టీఆర్ఎస్, బీజేపీపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. బండి క్షుద్రపూజలు, హరీష్ రావు కౌంటర్ వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్స్ ను పోస్ట్ చేసిన ఆయన.. బీజేపీ మంత్రాలతో చితకాయలు రాలవు, టీఆర్ఎస్ తంత్రాలతో ప్రజల సమస్యలు తీరవని ఎద్దేవ చేశారు. ఈ గజకర్ణ గోకర్ణ టక్కుటమార డ్రామాలు మాని పరిపాలన, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.
సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని బండి సంజయ్ చేసిన ఆరోపణలతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. తాంత్రిక విద్య నేర్పింది బీజేపీనే అని టీఆర్ఎస్ నేతలు ఆరోపించగా.. కాపలా కుక్కలా ఉండమని పదవిస్తే కచరా కుక్కలు పిచ్చెక్కి కరవడానికి ఊరి మీద పడ్డాయ్ అంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. రెండు పార్టీలను తప్పుబట్టారు.