పరకాల నియోజకవర్గం పోరాటాల గడ్డ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఈ గడ్డదన్నారు. అలాంటి ఈ గడ్డపై ఇప్పుడు దళారులు, దండుపాళ్యం ముఠా కట్టి దోచుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు.
పరకాలలో ఆయన ఈ రోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇక్కడి ఎమ్మెల్యే పేరులోనే ధర్మం ఉందన్నారు. కానీ ఆయన బుద్దిలో మాత్రం అది లేదన్నారు. ఈ ఎమ్మెల్యే దందాల రెడ్డి సంగతి అందరికీ తెలిసిందేనన్నారు.
ఇక్కడ మొత్తం కాంట్రాక్టులు ధర్మా రెడ్డివేనన్నారు. ఏ దోపిడీలో చూసినా ధర్మా రెడ్డి పేరే వినిపిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇవ్వలేదన్నారు. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదని ఆయన ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వంలో పేదలకు ఒరిగిందేం లేదని మండిపడ్డారు.
మరి 23లక్షల కోట్లు ఎవరింటికి పోయినయ్ అని ఆయన ప్రశ్నించారు. పరకాలలో అభివృద్ధి కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిందేనన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు.
వరి వేస్తే ఉరే అని కేసీఆర్ చెబుతున్న పరిస్థితి వుందన్నారు.
కాంగ్రెస్ ఏం చేసిందని డ్రామారావు అడుగుతున్నాడని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఏం చేసిందో వరంగల్ ఏకశిల పార్కు దగ్గర చర్చ పెడదామన్నారు. తాను చెప్పింది తప్పైతే ముక్కు నేలకు రాస్తానన్నారు. వారు చెప్పింది తప్పైతే ప్రజలకు క్షమాపణ చెబుతారా? అని ఆయన సవాల్ విసిరారు.
సిద్దిపేట చింతమడకలో గుడి, బడి నీళ్ల ట్యాంక్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనేన్నారు. హైటెక్ సిటీ, శిల్పారామం, మెట్రో రైల్, దేశంలో రైల్వే స్టేషన్లు తామే కట్టామన్నారు. పేపరు మిల్లులు తాము కడితే మీ అయ్య వచ్చి వాటిని మూతపడేశారని కేటీఆర్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు ఫామ్ హౌసులు కట్టుకున్నారు, వేలాది ఎకరాలు ఆక్రమించుకున్నారే తప్ప పేదలకు చేసిందేం లేదన్నారు.
నిజంగానే 4కోట్ల తెలంగాణ ప్రజలు మీ కుటుంబమే అయితే 10 ఎకరాల్లో కట్టుకున్న ప్రగతి భవన్ కు పేదలను ఎందుకు రానివ్వడం లేదు? అని ఆయన ప్రశ్నించారు.
12 వందల మంది అమరవీరుల కుటుంబాలలో ఏ ఒక్కరికైనా ఇంటికి పిలిచి బుక్కెడు బువ్వ పెట్టారా? అని ఆయన అడిగారు. నిజంగా తెలంగాణ ప్రజలు మీ కుటుంబమే అయితే పీజీ విద్యార్థి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? అని ప్రశ్నలు గుప్పించారు.