వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. నిన్న ఐదేండ్ల చిన్నారిని కుక్కలు కరిచి చంపేస్తే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.
కుక్కలకు ఆకలేసిందని హైదరాబాద్ మేయర్ మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. మనుషులను వీధి కుక్కలు పీక్కు తినే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. కుక్కల దాడిలో మనుషులు చనిపోతే కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇదంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ భూపాలపల్లి పర్యటనకు ముందే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక్కడి ఎమ్మెల్యేల భూముల ఆక్రమణలపై విచారణకు డ్రామారావు సిద్ధమా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కు అందులో వాటాలు లేకుంటే విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. ఆ ఆరోపణలను నిరూపించేందుకు తమ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.