– కేసీఆర్ సర్కార్ పై కాంగ్రెస్ పోరుబాట
– గ్రామపంచాయతీల నిధులపై ధర్నాకు ప్లాన్
– కానీ, ఎక్కడికక్కడే కాంగ్రెస్ నేతల అరెస్ట్
– ఇంటి నుంచి కాలు బయటకు పెట్టనివ్వని ఖాకీలు
– ధర్నాచౌక్ కు వెళ్లేందుకు చూసిన రేవంత్ రెడ్డి
– అడ్డుకుని బొల్లారం పీఎస్ కు తరలింపు
– 35వేల కోట్లు దోచేశారని కేసీఆర్ పై ఫైర్
– కొల్లగొట్టిన డబ్బుతో మేఘా, ప్రతిమ సంస్థలకు చెల్లింపులు
– సీఎం పరాయివాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు
సర్పంచుల నిధుల సమస్యలపై ధర్నా చేయాలని కాంగ్రెస్ అనుకోవడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ధర్నా నేపథ్యంలో సోమవారం ఉదయమే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన ధర్నా చౌక్ కు వెళ్లేందుకు చూశారు. ఈ క్రమంలో పోలీసులకు రేవంత్ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంటికి వచ్చి మరీ తనను అడ్డుకోవడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఓ ఎంపీగా తన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తిరగకూడదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్నాకు వెళుతున్నట్టు తానేమైనా చెప్పానా? అని పోలీసులను ప్రశ్నించారు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా పోలీసుల అనుమతి తీసుకోవాలా అంటూ మండిపడ్డారు. అయినప్పటికీ పోలీసులు ఆయన్ని బలవంతంగా బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు బొల్లారం ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పలుచోట్ల నేతలు ఆందోళనలకు దిగారు. బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చింపివేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఉన్నతాధికారుల సూచనలతో రేవంత్ రెడ్డిని సాయంత్రం పోలీసులు వదలి పెట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.35వేల కోట్ల పంచాయతీ నిధులను సీఎం కేసీఆర్ దొంగలించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కొల్లగొట్టిన నిధులతో మేఘా, ప్రతిమ సంస్థలకు బిల్లులు కడుతున్నారంటూ మండిపడ్డారు. వెంటనే సర్పంచుల ఖాతాల్లో నిధులను జమ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణతో పేరు బంధం ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు పేరు మార్పుతో ఆ బంధం కూడా తెగిపోయిందన్నారు. ఇప్పుడు తెలంగాణకు కేసీఆర్ పరాయివాడు, కిరాయివాడు అని పేర్కొన్నారు. తెలంగాణలో బిహార్ అధికారుల రాజ్యం నడుస్తోందన్న రేవంత్.. కేసీఆర్ కు కాలం చెల్లిపోయిందన్నారు. కేవలం మరో ఐదారు నెలలు మాత్రమే ఆయన అధికారంలో ఉంటారని చెప్పారు.
కేంద్రం మంజూరు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేశారని.. నిధులు పంచాయతీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం ఒక దొంగ అని, ఆయన్ని జైల్లో పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధులు రాకపోవడంతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచులు నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
పూర్తి కథనం…