కేసీఆర్ పాలనలో రైతుల భూమికి విలువ లేకుండా పోయిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మీనాక్షి నటరాజన్ ప్రారంభించిన సర్వోదయ సంకల్ప పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. భూదాన్ ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదే స్ఫూర్తితో ఈనెల 14 నుంచి పాదయాత్ర చేస్తున్నారు మీనాక్షి. భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రాం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల వల్ల వేలాదిమంది నిరుపేదలు నిరాశ్రయులయ్యారన్నారు రేవంత్. కేసీఆర్ వారందరినీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొండపోచమ్మ ద్వారా పేదలకు నీళ్లు ఇవ్వకుండా తన ఫాంహౌస్ కు తరలించుకుపోతున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలోని రైతులకు వరి వేయొద్దని చెప్పి ఫాంహౌస్ లో మాత్రం 150 ఎకరాల్లో కేసీఆర్ వరి సాగు చేయడమేంటని ప్రశ్నించారు.
రీజినల్ రింగు రోడ్డు పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడానికి చూస్తోందన్నారు రేవంత్. ఎకరాకు రూ.5 కోట్ల విలువున్న భూములకు కేవలం రూ.10 లక్షలు ఇస్తామంటూ మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రజలను చాలా విషయాల్లో కేసీఆర్ మోసం చేశారని విమర్శలు చేశారు.
భూమిలేని నిరుపేదల కోసం 75 ఏళ్ల కిందట వినోబాభావే ఈ ప్రాంతం నుంచే భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు రేవంత్. దళితులు, గిరిజనులు, ఇతర నిరుపేదలకు వందల ఎకరాల భూమిని పంచిపెట్టారన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ ఈ సర్వోదయ సంకల్ప యాత్రను మొదలుపెట్టారని చెప్పారు.