ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు స్పందించి ఫైర్ అయ్యారు. తాజాగా దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించబోమన్నారు.
పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆదేశాలను ధిక్కరించి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడే వారిపై అధిష్టానం అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
బీఆర్ఎస్‌తో ఉండబోదని ఇప్పటికే తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్‌లో కుండబద్దలు కొట్టారని అన్నారు. రాష్ట్రంలో రాబోయేది తమ ప్రభుత్వమేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు దౌర్జన్యాలపై ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదన్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్నారు. అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవాల్సిందే కాబట్టి సీఎం కేసీఆర్ తమను పొగుడుతూ బీజేపీని తిడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.