– ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నిరసన
– ఇది దేశ ప్రజలకు జరిగిన అవమానం
– గాంధీ కుటుంబం జోలికి రావొద్దు..
– బీజేపీ సర్కార్ పై రేవంత్ ఫైర్
గాంధీ కుటుంబంపై బీజేపీ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ బషీర్ బాగ్ ఈడీ కార్యాలయం వరకు సాగింది. అక్కడ కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఈ నిరసన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. సోనియా కుటుంబంపై ఈగ వాలినా అంతు చూస్తామని హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను బ్రిటీషర్లు నిషేధించారని.. స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. దేశ సమగ్రత కోసం నేషనల్ హెరాల్డ్ పత్రికను మళ్లీ నడపాలని నిర్ణయించారని చెప్పారు. పత్రిక నష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్లు ఇచ్చిందన్న ఆయన.. 2015లో ముగిసిన విచారణను మోడీ సర్కార్ మళ్లీ తెరపైకి తీసుకొచ్చిందని మండిపడ్డారు.
ఇది గాంధీ కుటుంబానికి జరిగిన అవమానం కాదని.. దేశ ప్రజలకు జరిగిన అవమానంగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి. ఇందిరాగాంధీపై సీబీఐ కేసు పెట్టి అవమానిస్తే… దేశం ఏకం అయ్యిందని, తిరిగి దేశానికి ఆమె ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. జూన్ 23 బీజేపీ పతనానికి పునాది రాయి అని ఆయన మండిపడ్డారు. సోనియా గాంధీ ఈడీ ఆఫీస్ లో అడుగు పెట్టిన క్షణం నుండే మోడీ, అమిత్ షా పతనం మొదలవుతుందని చెప్పారు. గాంధీ వారసులం కాబట్టి శాంతియుత నిరసన చేశాం.. సోనియా గాంధీని అవమానించాలని చూస్తే ఊరుకోమని ధ్వజమెత్తారు.
ఈ నెల 23న మళ్లీ ఈడీ ఆఫీస్ కి వస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… రాష్ట్రానికి ముందుగా ఈడీ, సీబీఐ వస్తుందని, తర్వాత మోడీ, అమిత్ షా వస్తారని సెటైర్లు వేశారు రేవంత్. కాంగ్రెస్ ర్యాలీ దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ కూడలి, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, చింతల్ బస్తీ, లక్డీకపూల్, బషీర్బాగ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కూడలి, అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సచివాలయం మార్గాల్లో వాహనాలను దారి మళ్లించారు.