50 లక్షల నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ చెలగాటమాడుతోందని తీవ్రంగా దుయ్యబట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరసన కార్యక్రమాల్లో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీలో 24, 25న నిరసన తెలపాలనుకున్నట్టు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిరసనలో పాల్గొని నిరుద్యోగులకు అండగా నిలబడాలనుకుంటున్నా అని రేవంత్ తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడతో మమ్మల్ని నిర్బంధించిందని దుయ్యబట్టారు. ఓయూలో నిరుద్యోగ నిరసనలో పాల్గొనాల్సిన నన్ను వందలాది మంది పోలీసులను పెట్టి గృహ నిర్బంధం చేశారన్నారు. అక్రమ నిర్బంధాలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ ఆటవిక చర్యని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రేవంత్. నేరాల్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడుతోందని చెప్పారు. అనర్హులను టీఎస్పీఎస్సీలో సభ్యులుగా నియమించారు.. నిబంధనలు ఉల్లంఘించి నియమించడాన్ని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వినాయక రెడ్డి కోర్టును ఆశ్రయించారని తెలిపారు. దీనిపై హైకోర్టు జడ్జి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని అన్నారు రేవంత్. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం ఎలా తీసుకుందని కౌంటర్ వేయాలని హైకోర్టు సూచించిందని చెప్పారు. కానీ ప్రభుత్వం కౌంటర్ వేయకుండా వాయిదాలు తీసుకుందన్నారు.
పరీక్షల నిర్వహణలో లోపాలు జరిగాయని స్పష్టంగా ఉన్నా… ఈ అంశాలపై సిట్ అధికారి విచారణ చేయడం లేదన్నారు. ఈ వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చిందంటే ఇందులో పెద్దల హస్తం ఉందని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. కేసు సిట్ కు బదిలీ చేయడం వెనక గూడుపుఠానీ దాగుందన్నారు. కేసును నీరుగార్చడానికే పేపర్ లీక్ కేసును సిట్ కు బదిలీ చేశారని ఆరోపించారు. ఈ కేసులో మొదట విచారణ చేయాల్సింది కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మీనే.. కానీ శంకర లక్ష్మీని సిట్ విట్ నెస్ గా చూపిస్తున్నారన్నారు.
ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రత్యక్షంగా కేటీఆర్ కు సంబంధం ఉందన్నారు రేవంత్ రెడ్డి. 2021 టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని చెప్పారు. లాలగూడలో సమయం దాటినా తరువాత కూడా జరిగిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించి అందరినీ విచారించాలని రేవంత్ డిమాండ్ చేశారు. శంకర లక్ష్మీ చేతిలో ఉండాల్సిన తాళాలు ఎవరి చేతిలోకి వెళ్లాయో తేల్చాలన్నారు. శంకర లక్ష్మీని సాక్షిగా కాదు.. నిందితులుగా చేర్చాలని కోరారు.
ఓయూ నిరసన దీక్షలో పాల్గొనేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు రేవంత్. 27న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని యూనివర్సిటీల విద్యార్థులను కలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ముఖ్య నాయకులతో ఢిల్లీకి వెళ్లి ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
కాగా రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు చర్యలు తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర తరువాత రాహుల్ పై బీజేపీ కక్ష సాధింపుకు పాల్పడుతోందని మండిపడ్డారు. మోడీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని అన్నారు. బీజేపీ రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతోందన్నారు రేవంత్ రెడ్డి.