సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో పోరాడుదామంటున్న కాంగ్రెస్ పై ఎందుకు దాడి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ గుజరాత్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ఆయన అడిగారు.
వ్యాపార భాగస్వామి కేజ్రీవాల్ను గెలిపించుకునేందుకు కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ చేస్తున్న దుర్మార్గాల్లో సీఎం కేసీఆర్ భాగస్వామ్యం లేదా అంటూ ఆయన నిలదీశారు. గత ప్రధానులు 67 ఏండ్లలో రూ. 56 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రధాని మోడీ మాత్రం 8 ఏళ్లలోనే రూ. 100 లక్షల కోట్ల అప్పు చేశారని ఆయన ఆరోపించారు.
దేశం కాంగ్రెస్ వల్లే ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల అవసరాల కోసం నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎన్నో ప్రాజెక్టులను నిర్మించారని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, పేదలకు విద్య, వైద్యం కల్పించారని ఆయన గుర్తు చేశారు.
ప్రాజెక్టులు గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే మేఘా కృష్ణారెడ్డి గుర్తుకొచ్చాడని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. కనీసం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లోనూ ఇండ్లకు త్రాగునీరు రావడం లేదన్నారు. పక్క రాష్ట్రాల రైతుల గురించి ఆలోచించే ముందు తెలంగాణలోని అన్నదాతల పరిస్థితి గురించి కేసీఆర్ ఆలోచించాలని ఆయన హితవు పలికారు.