ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వారిద్దరూ కలిసి దేశాన్ని అదానీ అంబానీలకు దోచి పెడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. అదానీ షేర్ విలువలు పెంచుతూ పెట్టుబడులు పెట్టించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆ తర్వాత అదానీ ఇచ్చిన ముడుపులను విదేశాలకు తరలిచారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ కాంట్రాక్టులు, పోర్టులన్నీ అదానీ, అంబానీ సంస్థలకే కట్టుబెడుతున్నారని ఆయన విమర్శించారు. హిడెన్ బర్గ్ వ్యవహారంలో అదానీకి కేంద్రం మద్దతుగా నిలబడుతోందని ఆయన అన్నారు.
అందుకే అదానీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా కేంద్రం విచారణ జరిపించడం లేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో ఇలాంటి ఆరోపణలు వస్తే జేపీసీలు వేశామని ఆయన గుర్తుచేశారు. అదానీ, ప్రధాని వేరు కాదన్నారు. వారిద్దరూ ఒక్కటేనని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో యూనివర్సీటీలకు, ప్రాజెక్టులకు చేసిందేంలేదని ఆయన ఫైర్ అయ్యారు. వాళ్లు చేసిందల్లా 3000 బెల్టు షాపులు, 30,000 వైన్ షాపులేనని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్‌లకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.