ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు ఈడీ నోటీసుల పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..కవితకు నోటీసులపై పీసీసీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదని మరోసారి స్పష్టం అయ్యిందన్నారు.
లిక్కర్ స్కాంలో సంబంధం ఉందా.. లేదా..సీఎం, పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కాంకు, తెలంగాణ సమాజానికి సంబంధం ఏంటని అన్నారు. తెలంగాణ సమాజానికి చెప్పి కవిత లిక్కర్ దందా చేసిందా అంటూ నిలదీశారు. ఉద్యమకారుల గురించి పట్టించుకోని కేసీఆర్ .. తన కుటుంబానికి ఆపద వస్తే వణికిపోతున్నారన్నారు. అవినీతిపరులు ఎవరైనా మోడీ సర్కార్ వదిలే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇక మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఢిల్లీలో కవిత చేపట్టిన ధర్నాపై ఆయన మాట్లాడుతూ..ఢిల్లోలో కాదు.. ప్రగతి భవన్ ముందు కవిత ధర్నా చేయాలన్నారు. సిగ్గు లేకుండా కేసీఆర్ బిడ్డ ఢిల్లీ పోయిన దీక్ష చేస్తోందని ఫైర్ అయ్యారు. 33 శాతం బీఆర్ఎస్ టికెట్లు మహిళలకు ఇవ్వనందుకు తన తండ్రి కేసీఆర్ ను కవిత ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ 33 శాతం రిజర్వేషన్ల గురించి ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ కవిత వలన మహిళా లోకం తల దించుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తన దందాలో నుంచి కవిత పేద మహిళలకు వాటా ఇవ్వాలన్నారు. కేసీఆర్ క్యాబినెట్ లో 33 శాతం మహిళా మంత్రులు ఎందుకు లేరని నిలదీశారు.
బీఆర్ఎస్ నాయకులే మహిళలకు శాపంగా మారారన్నారు. కేసీఆర్ హయాంలో మహిళా సర్పంచ్ కే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ చేత కాని తనం వల్లనే తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు.