మాటల కోటలు కట్టి..చక్రం తిప్పుదామని.. - Tolivelugu

మాటల కోటలు కట్టి..చక్రం తిప్పుదామని..

వెంకట్ గురిజాల, టీపీసీసీ నాయకుడు

అది.. క్రీ.పూ 2019.
చంద్రశేఖరుడు అనే రాజు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ.. ప్రపంచంలోనే ఉత్తమ రాజుగా తనకు తానే ప్రకటించుకొని, తన కొడుకును ఉత్తమ రాకుమారుడిగా ప్రచారం చేసి పరిపాలన చేస్తున్నాడు. అలా ఆ రాజు రాజ్యానికి ఏ సమస్య వచ్చినా.. దాన్ని ప్రజలు క్షణాల్లో మరిచిపోయేలా.. మాటల కోటలు కట్టి.. సమస్య ఉనికి లేకుండా చేసేవాడు. తనకు లేకపోయినా.. ప్రజలందరికీ.. ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేయాలని నిరంతర కృషి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా గుణాత్మక మార్పు కొరకు.. ఆయన చేయని ప్రయత్నమే లేదు. ఒక దశలో విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రాన్ని చేజిక్కించుకొని తానే చక్రం తిప్పుదామనుకున్నాడు.

కానీ. విష్ణుమూర్తి అంత ఈజీగా చక్రం ఇస్తాడా..? అయినా.. చంద్రశేఖరుడు ఊరుకుంటాడా? పట్టు వదలని విక్రమార్కుడై.. స్థానికంగా దొరికిన ఓ సైకల్​ చక్రాన్ని ఊడబీకి.. ఇష్టమొచ్చినంత సేపు తిప్పాడు. అలా.. ఎన్నో మహాకార్యాలు చేశాడు. రాజ్యంలోని ప్రజలు కష్టాల్లో ఉన్నా సరే.. పొరుగు రాజ్యపు రాజులను పిలిపించి వారికి స్వర్ణ కంకణాలు, స్వర్ణ పత్రాలు సమర్పించాడు. కోటానుకోట్ల బహుమతులు ముట్టజెప్పి.. తన చేతికి ఎముక లేదనిపించుకున్నాడు.

అలాంటి అత్యుత్తమ చక్రవర్తిని స్మరించుకుంటూ.. క్రీ.శ. 2016లో రాజ్యంలోని యాదాద్రి అనే ప్రాంతంలో అద్భుతమైన శిల్ప సంపదతో ఓ ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయ స్థంభాల మీద చంద్రశేఖరుని ముఖచిత్రం ప్రముఖ శిల్పులతో చెక్కించి ప్రతిష్ఠించారు. అప్పటిదే.. ఈ చిత్రం!

Share on facebook
Share on twitter
Share on whatsapp