మోడీ ప్రభుత్వం దేశాన్ని ఆదానీ, అంబానీలకు ప్రజల సంపదను దోచిపెడుతోందని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు హాజరైన రేవంత్ రెడ్డి.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేసినట్టు.. భవిష్యత్తులో భారత సైన్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలనే ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆరోపించారు రేవంత్. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని తెలిపారు.
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనూ అగ్నిపథ్ పై చర్చిస్తామని తెలిపారు రేవంత్. కక్షసాధింపులో భాగంగానే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీ విచారణ పేరుతో వేధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై కేంద్రానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారనే కక్షతో.. కేసులు పెట్టి ఈడీ విచారణకు పిలుస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అగ్నిపథ్ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నారు.