టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సర్పంచుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో సోమవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో ధర్నా జరగనుంది. దీంతో ముందస్తుగా పోలీసులు రేవంత్ రెడ్డిని గృహనిర్భంధం చేశారు. పోలీసు వాహనాలు, వ్యాన్లను సిద్ధం చేసుకొని భారీగా పోలీసులతో ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకుల ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు. వారిని గృహ నిర్బంధం చేశారు. అంతేకాదు.. పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అయితే ఈ ధర్నా నిర్వహించుకునేందుకు టీపీసీసీ పెట్టుకున్న దరఖాస్తుకు అనుమతిని పోలీసులు నిరాకరించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ధర్నా నిర్వహిస్తామని టీపీసీసీ సీనిరయర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారుఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా కార్యక్రమం ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ ను ముందస్తు అరెస్ట్ చేశారు.
ఈ విషయం గురించి నాలుగు రోజుల క్రితమే రేవంత్ రెడ్డి కేసీఆర్ కి లేఖ రాశారు. ఆ లేఖలో స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా ఇచ్చే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే నిధులు విడుదల చేసి పంచాయతీలను ఆదుకోవాలని కోరిన ఆయన.. ప్రభుత్వం సర్పంచుల హక్కులను కాలరాస్తోందని అన్నారు. రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్న రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులను దొంగచాటుగా దారి మళ్లించారని పేర్కొన్న ఆయన ప్రతీ నెల విడుదల చేయాల్సిన రూ.250 కోట్లు 5 నెలలుగా విడుదల చేయడంలేదని అన్నారు.
దీంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్వానంగా మారిందని అన్నారు. ఇక అభివృద్ధి పనులలో చాలా వరకు బిల్స్ పెండింగులో ఉన్నాయని, సర్పంచులు అప్పుల పాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ లకు ఈఎమ్ఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నరని పంచాయతీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరిన ఆయన లేకపోతే సర్పంచుల హక్కుల సాధన కోసం పోరాడతామని అన్నారు. జనవరి 2న ఇందిరాపార్క్ వద్ద టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని కూడా లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.