సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయించి.. కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏంటని ప్రశ్నించడమే తామ చేసిన పాపమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని ప్రశ్నించారు రేవంత్. అలాగే.. కేసీఆర్ జన్మదినం.. నిరుద్యోగుల కర్మదినంగా మారిందని అన్నారు.
కేసీఆర్ బర్త్ డే ఉత్సవాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్. నిరుద్యోగులకు మద్ధతుగా, మెగా నోటిఫికేషన్ డిమాండ్ తో అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని సూచించారు.
గురువారం ఉదయం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రెండోరోజు కూడా ఆయన ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. బయటకు వెళ్లడానికి వీలు లేదని అడ్డుకున్నారు. పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పినా వినలేదు పోలీసులు. రేవంత్ బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు చూశారు. ఆ సమయంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.