నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం చేసే తుది దశ ఉద్యమమే జోడో యాత్ర అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తాను యాత్ర చేస్తున్న సమయంలో దారి పొడవునా ఎవరిని కదిలించినా వారికి దుఃఖం పొంగుకొస్తోందన్నారు.
బీఆరెస్ ను వందమీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని ప్రజలు ఆవేశంగా చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే బాగుపడతామని ఆడబిడ్డలు చెప్పారన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు.
నిరంకుశ పాలనలో తమను వేధిస్తున్నారని ప్రజలు ఆవేదనగా చెబుతున్నారని వెల్లడించారు. ఆర్టీసీలో 6200 బస్సులుంటే 3200 బస్సులు ప్రైవేటువేనన్నారు. 50వేల మంది చేసే పనిని 40వేల మందితో వెట్టి చాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఒకటో తారీఖున వచ్చే జీతాలు 8వ తేదీ వచ్చినా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. వృద్దులకు పెన్షన్లు ఇచ్చే దిక్కు లేదని వాళ్లు గోడు వెళ్లబోసుకుంటున్నారన్నారు.
ఇందిరమ్మ ఇచ్చిన పోడు భూములను హరితహారం పేరుతో గుంజుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఈ ఊర్లో ఒక దుశ్యాసన ఎమ్మెల్యే ఉన్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దుశ్శాసనుడు కలెక్టరమ్మ చేయిపట్టి లాగాడని ఆరోపించారు.
మెడికల్ కాలేజీ పేరుతో పేదల భూములు గుంజుకున్నాడని అన్నారు. పేదల భూములను కుటుంబ సభ్యుల పేర్లతో రాయించుకున్నారని చెబుతున్నారని, ఇక్కడ రాక్షస పాలన సాగుతోందని ప్రజలు చెబుతున్నారన్నారు.
ములుగులో తన వ్యాఖ్యలపై బీఆరెస్ నేతలు పోలీసులకు పిర్యాదు చేశారన్నారు. రాజ్యాలను కూల్చి రాచరికాన్ని బొంద పెట్టిన చరిత్ర తెలంగాణదని వివరించారు. రాష్ట్రంలో పాలన చూస్తుంటే రజాకార్లు మళ్లీ వచ్చినట్లు ఉందన్నారు.
ఎక్కడ దోపీడీలు, కబ్జాలు జరిగినా అక్కడ బీఆరెస్ నేతలున్నారని ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ కాదు ఆయన కింద పనిచేసే కుక్కలు వచ్చినా నెత్తి మీద కాలు పెట్టి తొక్కి పాతాళానికి పంపిస్తామని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రగతి భవన్ లోపలికి పేదలకు ఎందుకు ప్రవేశం లేదని ప్రశ్నించారు. అందుకే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామని తాను చెప్పానన్నారు. కేసీఆర్ గుర్తు పెట్టుకో బిడ్డా కొత్త ఏడాదిలో ప్రగతి భవన్ గడీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.