వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని మిట్టీబౌలీలో ఇటీవల కిడ్నాప్, హత్యకు గురైన పన్నెండేళ్ల బాలుడు రజా ఖాన్ కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. బాలుడి తండ్రి ఆఫ్రోస్మాన్ ను కలిసిన రేవంత్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ లో కిడ్నాప్, హత్యల సంస్కృతి గతంలో లేదన్నారు. ఇలాంటి సంస్కృతి పెరగడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డితో ఫోన్ లో మాట్లాడి కేసు పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు రేవంత్. అవసరమైతే ఐజీతో కూడా మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు రేవంత్ రేడ్డి.
కాగా కొడంగల్ పట్టణానికి చెందిన బాలుడు రజా ఖాన్ అక్టోబర్ 29న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా బాలుడు కనిపించకపోయే సరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే అక్టోబర్ 31న ఉదయం ఎస్సీ హాస్టల్ ముందు ఓ సూట్ కేసులో మృతదేహం కనిపించగా.. పోలీసులు పంచనామా నిర్వహించారు. దీంతో ఆ మృతదేహం కనిపించకుండా పోయిన బాలుడిదిగా గుర్తించారు. గుప్త నిధుల కోసమే బాలుడ్ని బలి ఇచ్చి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే బాలుడిని ఎందుకు హత్య చేశారనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.