చీటికి మాటికి పార్టీ అధ్యక్షుడు రేవంత్ పై ఒంటికాలుపై లేస్తున్న జగ్గారెడ్డికి పార్టీ షాకిచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తొలగించింది. జగ్గారెడ్డికి అప్పగించిన పార్లమెంట్ నియోజక వర్గాలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా తప్పించింది.
ఇప్పటిదాకా జగ్గారెడ్డి చూసుకున్న పనులను మిగిలిన నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్, అజారుద్దీన్, మహేష్ కుమార్ కు అప్పగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది టీపీసీసీ.
ఆమధ్య సీఎల్పీ కార్యాలయంలో రేవంత్, జగ్గారెడ్డి కలిసి భేటీ అయ్యారు. సమస్యలు తొలగిపోయాయని క్యాడర్ సంబరపడింది. కానీ.. అంతలోనే మళ్లీ జగ్గారెడ్డి.. రేవంత్ పై విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లూ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడాన్ని పెద్దగా పట్టించుకోలేదు టీపీసీసీ. కానీ.. సీనియర్లు సపరేట్ గా మీటింగ్ పెట్టడంపై సీరియస్ గా ఉంది. ఏఐసీసీ సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓవైపు మీటింగ్ పై చర్చ జరుగుతుండగానే ఏం చేసుకుంటారో చేసుకోండి.. రాజీనామా చేస్తా.. నాపై ఎవరినైనా పోటీకి నిలబెట్టి గెలిపించుకోండని రేవంత్ కు జగ్గారెడ్డి సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యల ఫలితంగానే ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.