తెలంగాణలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీభవన్ లో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తూ పాలన సాగిస్తున్నాయని విమర్శించారు రేవంత్. ఖమ్మంలో మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తే కేసులు పెట్టి దొంగల్లా జైల్లో పెట్టారని మండిపడ్డారు. నేరెళ్లలో ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే యువకులను అరెస్ట్ చేసి హంసించారని.. భద్రచలంలో ఆదివాసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టి దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా త్వరలో జైల్ భరో చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఉద్యమకారులు నిరుద్యోగులు, మేధావులు మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు రేవంత్. ప్రజలు పాలకులను కలిసి వినతి పత్రం ఇద్దామంటే సచివాలయం కూడా లేదని విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు, యువకులు ప్రజలకు అండగా ఉండాలని వారి హక్కులను సాధించేందుకు మద్దతుగా ఉద్యమాలు చేయాలన్నారు.
బీజేపీ పాలనలో ప్రధాని మోడీ చక్రవర్తి అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ సామంత రాజు అంటూ సెటైర్లు వేశారు రేవంత్. మోడీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ డిక్టేటర్ లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక కేసీఆర్ ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి నెలకొందంటూ చురకలంటించారు. ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి లేక తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.