– ఉదయం కొట్టుకుంటారు
– సాయంత్రం కలుస్తారు
– బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే
– దళితులపై దాడులపై ఏం సమాధానం చెప్తారు?
– ఎస్సీ కమిషన్ నివేదిక ఎప్పుడు బయటపెడ్తారు?
– బండి సంజయ్ ని నిలదీసిన రేవంత్
– డ్రామారావు అవినీతికి 9వ ప్యాకేజీ బలైంది!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మంత్రి కేటీఆర్ ఇలాకాలో కొనసాగింది. సిరిసిల్ల గడ్డపై స్థానిక ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ అరాచకాలను తరిమికొట్టేందుకు ఇక్కడకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు అంటూ మొదలుపెట్టిన రేవంత్.. తెలంగాణ ఉద్యమం కోసం పదవీ త్యాగం చేసిన నేతన్న బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. 2001లో కేసీఆర్ కు కొండా లక్ష్మణ్ పార్టీ ఆఫీస్ ఇచ్చి ఆశీర్వదిస్తే.. ఆయన చివరి చూపులకు కూడా వెళ్లని దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు. సకల జనులు సాధించుకున్న తెలంగాణను కాలనాగు లాంటి కల్వకుంట్ల కుటుంబం కాటేస్తోందని తీవ్రవ్యాఖ్యలు చేశారు.
15 ఏళ్లుగా ఎంత కష్టమొచ్చినా, ఆస్తులు పోగొట్టుకున్నా కేకే మహేందర్ రెడ్డి జనానికి తోడుగా ఉంటున్నారని అన్నారు. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ పిచ్చికుక్కలా మారి కరుస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. అందుకే ఆయన్ను తరిమి తరిమి రాళ్లతో కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కేటీఆర్ ఇసుక దోపిడీకి, ధన దాహాన్ని ఓ దళిత బిడ్డ అడ్డుకుంటే.. దాడులు చేయించారని ఆరోపించారు. ఓట్లేసిన సిరిసిల్ల ప్రజలను పోలీసుల బూట్లకింద కేటీఆర్ నలిపేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదించిన మీరాకుమారిని కేసీఆర్ అవమానించారని గుర్తు చేశారు.
ఎస్సీ కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని.. బండి సంజయ్ ఎవరికి లొంగిపోయారని ప్రశ్నించారు. నివేదికను బయటపెట్టి దళితులపై దాడిచేసిన వారిని ఎందుకు శిక్షించడంలేదని అడిగారు. నేరేళ్ల దళితుల దాడులపై ఎప్పటిలోగా నివేదిక బయటపెడతారని నిలదీశారు. కూలీ డబ్బులు తప్ప ప్రభుత్వం తమకు చేసిందేం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్న రేవంత్.. అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం సిరిసిల్ల నేతన్నలను ఎందుకు అడుకోవడం లేదని అడిగారు. సిరిసిల్లకు పట్టిన కొరివి దయ్యాన్ని వదిలించాలని.. కేటీఆర్ తెలంగాణ కుటుంబ సభ్యుడు కాదు.. దండుపాళ్యం ముఠా సభ్యుడు అంటూ విమర్శించారు. పోలీసుల పహారా మధ్య ప్రగతి భవన్.. పాకిస్తాన్, ఇండియా బార్డర్ ను తలపిస్తోందని అన్నారు.
అమరుల కుటుంబాలను ప్రగతి భవన్ కు పిలిచి బుక్కెడు బువ్వ పెట్టలేదన్న ఆయన.. కేసీఆర్ ఫ్యామిలీని తెలంగాణ పొలిమేరలకు తరిమేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులంతా ఆస్తులు పోగొట్టుకుంటే.. కేటీఆర్ కు ఇన్ని కోట్ల ఆస్తులెలా వచ్చాయని అడిగారు. పేద బిడ్డలు ప్రగతి భవన్ కు వచ్చేలా ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టాలన్న రేవంత్.. అప్పుడే కేసీఆర్ తెలంగాణ కుటుంబ సభ్యుడని నమ్ముతామని చెప్పారు. ‘‘నాలుగు కోట్ల ప్రజలం మనం.. నలుగురు వాళ్లు.. నమ్మితే ప్రాణాలు ఇచ్చే వాళ్లం మనం.. నమ్మితే గొంతు కోసే రకాలు వాళ్లు.. అలాంటి వారిని తెలంగాణ నుంచి తరమాలి’’ అని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.