సీఎం కేసీఆర్ కొడంగల్ పై కక్ష కట్టారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొండగల్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 8 మండలాలు ఉన్న వనపర్తి జిల్లా అయింది.. మరి కొడంగల్ రెవెన్యూ డివిజన్ ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. అందుకే, కొడంగల్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి.. మూడు జిల్లాల్లో కలిపారన్నారు. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని కొడంగల్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా డ్రామారావు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
కృష్ణానది జలాలు తెచ్చి నెత్తిమీద చల్లుకుంటా అన్నారు.. కానీ నాలుగేళ్లలో కొడంగల్ కు చేసిందేమీ లేదన్నారు రేవంత్. దత్తత తీసుకున్న డ్రామారావుకు సవాల్ విసురుతున్నానన్నారు. నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూం ఇచ్చినట్టు నిరూపించినా.. ఆ గ్రామంలో కాంగ్రెస్ ఓటు అడగదని స్పష్టం చేశారు. లేకపోతే తప్పు ఒప్పుకుని కొడంగల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాయాలని ఛాలెంజ్ విసిరారు.
తాము ప్రతిపాదించిన నారాయణపేట ఎత్తిపోతల కట్టకుండా పక్కనబెట్టారని విమర్శించారు. ఇక్కడికి రావాల్సిన వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కూడా రాకుండా చేశారన్నారు. దీంతో ఇక్కడ ఏర్పాటు కావాల్సిన సిమెంట్ ఫ్యాక్టరీలు రాక.. యువతకు ఉద్యోగాలు రాకుండా పోయాయని మండిపడ్డారు. నాలుగేళ్లలో స్థానిక ఎమ్మెల్యే ఏ సమస్యపైనైనా అసెంబ్లీలో మాట్లాడారా? అని అడిగారు రేవంత్.
రోజూ ఇక్కడే తిరుగుతున్న ఎమ్మెల్యే.. డబ్బులు వసూళ్లు చేసుకుంటున్నాడే గానీ, ఆయన వల్ల ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మళ్లీ ఇలాంటి తప్పు జరగకుండా చూడాలని.. కొడంగల్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని కోరారు. నాయకులంతా కలిసికట్టుగా ఉండి.. లక్ష ఓట్లే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు రేవంత్ రెడ్డి.