ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిస్తేనే రాజకీయాల్లో రాణించడం సులువవుతుంది. సరిగ్గా ఇదే ఫార్ములాను పక్కాగా ఫాలో అవుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. తన వద్దకు వచ్చేవారిని ఆదరించడంతో పాటు.. అవసరమైన వారి దగ్గరకు మాత్రం తానే స్వయంగా వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఎంతకైనా దిగివచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలను పంపిస్తున్నారు. పైగా దాగుడుమూతలు లేవు.. రహస్య మంతనాలు అంతకన్నా లేవు.. నేరుగా వెళ్లి వారితో హ్యాండ్ కలుపుతున్నారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్‌లో చేరతారని కనీసం ప్రచారం కూడా లేని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్లి .. పార్టీలోకి రావాలని ఆహ్వానించి రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచారు రేవంత్ రెడ్డి. తాజాగా అదే పంథాలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి దగ్గరకు వెళ్లి చర్చనీయాంశమయ్యారు. తీగల కృష్ణారెడ్డి బంధువు బొడుగం శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందడంతో పరామర్శించేందుకు వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. రేవంత్ రెడ్డి మాత్రం ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించేందుకు వెళ్లారన్నది సుస్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే టీఆర్ఎస్ అధిష్టానంపై తీగల కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
గత ఎన్నికల్లో మహేశ్వరం నుంచి ఓటమిపాలైన తర్వాత.. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ తరపున గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించడమేకాకుండా మంత్రి పదవివి కట్టబెట్టారు కేసీఆర్. నాటి నుంచి ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యమే లేకుండాపోయింది. ఈక్రమంలో గతంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన వియ్యంకుడు మంత్రి మల్లారెడ్డి రాయబారంతో ఆయన ఆలోచనను విరమించుకున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా ఉందని సముదాయించారు. కానీ ఇదంతా జరిగి ఏడాదిపైనే అవుతోంది. ఎమ్మెల్సీ గురించి ఉలుకుపలుకు లేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజాగా రేవంత్‌రెడ్డి మీర్‌పేటలోని తీగలకు చెందిన టీకేఆర్ కాలేజీకి వచ్చి.. పార్టీలోకి రావాలని కోరినట్టుగా తెలుస్తోంది. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పనిచేసిన అనుభవం ఉండటంతో.. పాటు మహేశ్వరంలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు కూడా లేకపోవడంతో ఆయన పార్టీ మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే తీగల కోడలు అనితారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్‌గా ఉన్నారు. ఒకవేళ తీగల పార్టీ మారితే ఆ పదవి వారి నుంచి చేజారిపోవచ్చు. దీంతో తీగల ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.