– అన్నదాతలంటే ఎందుకంత చిన్నచూపు
– మోడీ, కేసీఆర్ ఒక్కటే
– కాంగ్రెస్ లో హయాలో చాలా ప్రాజెక్టులు కట్టాం
– పూర్తవని వాటిని 8ఏళ్లుగా పట్టించుకోలేదు
– వరంగల్ సభ రైతు ఆత్మగౌరవం కోసం
– ఉమ్మడి నల్గొండ సమన్వయ సభలో రేవంత్
ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. మే 6న వరంగల్ సభ విజయంతం కోసం నాగార్జునసాగర్ లో శుక్రవారం నిర్వహించిన.. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో రేవంత్ మాట్లాడారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతులకు వరి వద్దని.. కేసీఆర్ ఫాంహౌస్ లో మాత్రం పండించుకున్నారని విమర్శించారు. ఇప్పుడు వరి వేయని రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అసలు రైతులను ఆదుకునేలా చర్యలు ఏం తీసుకుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులు కష్టాల్లో ఉన్నా ఈ ప్రభుత్వానికి పట్టదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. వరి కొనుగోలుకు 7 వేల ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి.. కేవలం 2,300లు మాత్రమే ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోనె బస్తాలు సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించలేదని, అవి కావాలంటే టెండర్ వేసినా ఎవరూ రావట్లేదని విమర్శించారు. వర్షానికి పంట తడిసిపోకుండా కనీసం టార్పాలిన్ ఇవ్వలేని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓటమిపాలవ్వాలని డబ్బు పంచారని ఆరోపించారు. సాగర్ డ్యామ్ కాంగ్రెస్ కట్టిందని సగర్వంగా చెప్పుకుంటామన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు రేవంత్. తాము మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మలు టీఆర్ఎస్ నేతలు అని ఘాటుగా విమర్శించారు. నెల్లికల్లు లిఫ్ట్ ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని ఇప్పటికీ మొదలు పెట్టలేదని, భూ కబ్జాలు చేసే ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇసుక మాఫియా కు పాల్పడే జగదీశ్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు.
రైతుల జీవితాలతో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రానికి రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనమే కావాలి రైతు ప్రయోజనం అవసరంలేదని ఫైరయ్యారు. వరంగల్ సభ రైతుల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న సభ అని దాని ద్వారా అన్నదాతలకు మేలు జరగాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి.