– 60 రోజులు.. 50 నియోజకవర్గాలు
– ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే జోడో యాత్ర
– నేతలు పార్టీ లైన్ దాటొద్దన్న రేవంత్
– అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
– తాను అందరివాడినంటున్న థాక్రే
– కలిసికట్టుగా ఉండాలని నేతలకు సూచన
– సమస్య ఏదైనా తనకే చెప్పాలని స్పష్టం
– రేపు నాగర్ కర్నూల్ లో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ
ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ కు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కాంగ్రెస్ పరిస్థితే గందరగోళంగా ఉంది. అయితే.. కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే అన్నింటినీ సెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గాంధీ భవన్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వ్యూహాలు, హాత్ సే హాత్ జోడో యాత్రపై చర్చలు సాగించారు. థాక్రే పార్టీ నేతలకు ఓ సంకేతాన్ని పంపారు. తాను అందరివాడనని స్పష్టం చేశారు. ఎవరికీ అనుకూలం కాదని.. అలాంటి ఆలోచన పక్కన పెట్టేయాలని నేతలకు సూచించారు. హాత్ సే హాత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ సందేశాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలన్నారు. అంతా ఐక్యంగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.
సమస్యలు ఉంటే తనతో చెప్పాలని సూచించారు. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దన్నారు. ఇక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర 60 రోజులపాటు సాగుతుందని.. భద్రాచలం లేదా మహబూబ్ నగర్ లేదా ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు.. 150 కోట్ల మంది నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలు పెట్టారని చెప్పారు. ఆ యాత్ర సందేశాన్ని ప్రతీ గుండెకు చేరవేయడానికే హాత్ సే హాత్ జోడో యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఈనెల 26న కశ్మీర్ లో రాహుల్ యాత్ర ముగిస్తే అదే రోజు తెలంగాణలో యాత్ర మొదలు పెట్టాలనుకున్నామని.. కానీ, భద్రతా కారణాలు చూపి రాహుల్ జాతీయ జెండా ఎగురవేయకుండా బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు.
కశ్మీర్ లో జెండా ఎగరేసి తీరాల్సిందేనని రాహుల్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈనెల 30న ఈ కార్యక్రమం ఉంటుందని.. టీపీసీసీ, సీఎల్పీ సహా తెలంగాణ ముఖ్య నాయకులంతా ముగింపు సభకు హాజరవుతారన్నారు. దాని తర్వాత ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, 3 నుంచి శాసనసభ సమావేశాలు, 5న రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉందని.. అందుకే 6 నుంచి యాత్ర ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకాగాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని తీర్మానించామన్నారు. ఈ యాత్రలో రాహుల్ గాంధీ లేఖ, మోడీ, కేసీఆర్ వైఫల్యాలపై చార్జీషీటు వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ‘‘జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాతాపాటు పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. దీంతో హాత్ సే హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర సమన్వయం కోసం పరిశీలకులను నియమించడం జరుగుతుంది. బాధ్యతగా పనిచేయని వారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తాం. యాత్రలో పాల్గొనని వారిపై కూడా చర్యలుంటాయి’’ అని చెప్పారు రేవంత్.
రేపు నాగర్ కర్నూల్ లో సభ
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మార్కండేయ ప్రాజెక్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారని.. ఇంతవరకు తట్ట మట్టి తీయలేదన్నారు రేవంత్. ఈ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన నాగంపై బీఆర్ఎస్ నేతల దాడిపై సమావేశంలో చర్చించామని చెప్పారు. అంతేకాకుండా బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని మండిపడ్డారు. మహిళా సర్పంచును అవమానించారని నాగం జనార్దన్ రెడ్డిపై కూడా కేసు పెట్టారన్నారు. నాగం వల్ల ఎలాంటి అవమానం జరగలేదని డీఐజీ దగ్గర ఆ మహిళా సర్పంచ్ స్టేట్ మెంట్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అయినా ప్రభుత్వం తప్పు దిద్దుకోలేదని… అందుకే ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నాగర్ కర్నూల్ లో రేపు దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు మాణిక్ రావు థాక్రేతో పాటు ముఖ్య నాయకులంతా హాజరవుతారని వివరించారు రేవంత్.