– ఇది రాజకీయ పోరాటం కాదు.. ఆత్మగౌరవ పోరాటం!
– సోనియా మీద దాడి అంటే భరతమాత మీద దాడి!
– తెలంగాణ తల్లి మీద దాడి
– రాష్ట్ర ప్రజలకు సోనియానే తెలంగాణ తల్లి!
– ఆమెకు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపై ఉంది!
– బీజేపీ బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదు
– మోడీ సర్కార్ పై రేవంత్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీలో సోనియాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన నేపథ్యంలో హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. అంతకుముందు నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు. రేవంత్ సహా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. బీజేపీ కుట్రలను అందరూ గమనించాలని కోరారు.
దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. మహిళా హక్కులు కాపాడాలంటే సోనియా నేతృత్వంలోని యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో రావాలని చెప్పారు. మన తల్లి మీద చెయ్యేస్తే తల నరికేయాల్సిన అవసరం ఉంటుందని.. ఆ బాధ్యతతోనే ఈడీ ఆఫీస్ ముందు నిరసనకు దిగానన్నారు రేవంత్. దర్యాప్తు సంస్థలు తమ మానసిక స్థితిని దెబ్బతీయలేవని.. మాతో పెట్టుకోవాలని అనుకుంటే.. డేట్ చెప్పండి.. రాంలీలా మైదానంలో తేల్చుకుందామని సవాల్ చేశారు.
దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబాన్ని అవమానిస్తే ఏమొస్తుందన్న రేవంత్.. మోడీకి రాజకీయ, మానసిక రాక్షసానందం వస్తుందేమో గానీ.. జనానికి ఉపయోగం లేదని తెలిపారు. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అక్కడి ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు. దేశానికి సోనియా ఉక్కు మహిళ అని అభివర్ణించారు. ఓవైపు పార్లమెంట్ జరుగుతుంటే.. ఇంకోవైపు సోనియాను ఈడీ ఆఫీస్ కు రమ్మంటారా? అంటూ మండిపడ్డారు. ధరల పెంపు, జీఎస్టీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే.. దాన్ని తెరమరుగు చేయడానికే సోనియాను ఈడీ ఆఫీస్ కు పిలిచారని విమర్శించారు.
కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని.. మోడీ, అమిత్ షాకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు రేవంత్. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా సోనియాకు అందరూ మద్దతుగా నిలబడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం అంటే దానికి కారణంగా ఆమెనేనని గుర్తు చేశారు. ఇది రాజకీయ పోరాటం కాదని.. ఆత్మగౌరవ పోరాటమని చెప్పారు. సోనియా మీద దాడి అంటే భరతమాత మీద దాడి.. తెలంగాణ తల్లి మీద దాడి అని అన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియానే తెలంగాణ తల్లని.. అందుకే ఆమెకు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. బీజేపీ బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ఇటు సోనియాని ఈడీ విచారించడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. గత ఎనిమిదేళ్లుగా దేశంలో ప్రతిపక్షాన్ని అంతమొందించడమే లక్ష్యంగా సామాన్యుల తరఫున ప్రశ్నించే గొంతులను నొక్కడమే ధ్యేయంగా మోడీ సర్కార్ పని చేస్తోందని హస్తం నేతలు మండిపడ్డారు. ఆ అరాచకానికి పరాకాష్టే సోనియమ్మను ఈడీ ముందుకు పిలవడమంటూ ఫైరయ్యారు. హైదరాబాద్ ర్యాలీలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనం దగ్ధం చేసి నిరసన తెలిపారు.
కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్ లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్ ను ఈడీ ప్రశ్నించింది. రాహుల్ గాంధీని కూడా విచారించింది. ఆ సమయంలో కూడా ఇలాగే కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ధర్నాలు కొనసాగించారు.