– అమెరికా టూర్ ముగించుకుని నగరానికి రేవంత్
– గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్
– పబ్ కేసుపై మాట్లాడుతూ సెక్షన్ 8 ప్రస్తావన
– గవర్నర్ అధికారాలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్
– బీజేపీ, టీఆర్ఎస్ దోస్తీపై విమర్శలు
వక్ఫ్ బోర్డు చైర్మన్ ని ఎందుకు తీసేయడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మృగశిర కార్తె నేపథ్యంలో రేవంత్‌కు కాంగ్రెస్ మత్స్యకార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మెట్టు సాయికుమార్ పెద్ద చేప బహుకరించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో మీడియాతో ముచ్చటించారు రేవంత్.
సెక్షన్- 8 ప్రకారం జంట నగరాల్లో గవర్నర్ కు సర్వాధికారాలు ఉన్నాయని గుర్తుచేశారు. అవసరమైతే పరిపాలనను చేతిలోకి తీసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ కు అధికారంతో పాటు బాధ్యత కూడా ఉంటుందన్నారు. బాధ్యత తీసుకోనప్పుడు రాజ్యాంగం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. సెక్షన్ 8 పై రేవంత్ రెడ్డి ఈ సమయంలో మాట్లాడడం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా, తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని.. రాష్ట్రంలో క్రియాశీలక ప్రభుత్వం లేనందున గవర్నర్ అధికారాలు ఉపయోగించి అన్నింటినీ సరిదిద్దాలని తెలిపారు.
రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోని పౌరుల భద్రతని దృష్టిలో ఉంచుకొని ఏపీ పునర్విభజన చట్టంలో సెక్షన్ 8ను పొందుపర్చారు. దీని ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల రక్షణ, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపులపై గవర్నర్ కు బాధ్యతలు ఉంటాయి. గతంలో అనేక సందర్భాల్లో సెక్షన్ 8 ప్రస్తావనకు రాగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఎందుకంటే సెక్షన్ 8 అమలు చేస్తే జీహెచ్ఎంసీలో కీలక అంశాలు గవర్నర్ పరిధిలోకి వెళ్తాయి. అది టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా మైనర్ బాలిక ఘటనపై స్పందించిన రేవంత్.. మరోసారి దీనిపై మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక ప్రధానికి గవర్నర్ ఏం చెప్పినా లాభం లేదన్నారు రేవంత్. కేసీఆర్ మాటే మోడీ, అమిత్ షా వింటారంటూ ఎద్దేవ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ సొంత అభ్యర్దిని పెడితే మోడీకి వ్యతిరేకం అని అనుకోవచ్చన్న ఆయన.. లేదంటే.. బీజేపీకి అనుకూలంగానే టీఆర్ఎస్ ఉంటుందని అందరికీ అర్థం అవుతుందన్నారు. అలాగే ఓటింగ్ కి దూరంగా ఉన్నా.. బహిష్కరణ చేసినా బీజేపీ, టీఆర్ఎస్ దోస్తీ బయటపడుతుందని చెప్పారు. కేసీఆర్ ఆర్ధిక ఉగ్రవాదంటూ ఓరేంజ్ లో విరుచుపడ్డారు. ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు రేవంత్.