తక్షణమే మంత్రులు కేటీఆర్, సబిత బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. విద్యార్థులను కలిసేందుకు వెళ్లిన ఆయన్ను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. తానేమైన కేసీఆర్ ఫాం హౌస్ పై బాంబులు వేయడానికి వచ్చానా? అని నిలదీశారు.
బాసర టిపుల్ ఐటీ విద్యార్థులతో తాను మాట్లాడితే ప్రభుత్వానికి భయం దేనికని ప్రశ్నించారు రేవంత్. కేసీఆర్ సమీక్షలు పెట్టాల్సింది బిహార్ రాష్ట్ర సమితిపై కాదని.. రాష్ట్రంలో యూనివర్సిటీల పరిస్థితిపై పెట్టాలని హితవు పలికారు. వైఎస్ హయాంలో ఏర్పాటైన బాసర ట్రిపుల్ ఐటీపై సబితకు ప్రత్యేక అభిమానం ఉంటుందనుకున్నానని అన్నారు.
విద్యార్థులవి సిల్లీ సమస్యలు కాదన్న రేవంత్.. ముఖ్యమంత్రి వ్యవహార శైలే సిల్లీగా ఉందని మండిపడ్డారు. అత్యాచారాలు జరుగుతుంటే నియంత్రించలేని పోలీసు వ్యవస్థ.. ప్రజా సమస్యలపై కొట్లాడుతున్న తమని నియంత్రిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో విద్యార్థి-యువత సమస్యలపై కాంగ్రెస్ కార్యచరణ సిద్ధం చేస్తుందని వారి కోసం డిక్లరేషన్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థులను కలిసేందుకు రేవంత్ రెడ్డి అనేక మార్గాల్లో ప్రయాణించారు. మహారాష్ట్ర వెళ్లి.. అక్కడి నుంచి పొలాల్లో ట్రాక్టర్ పై ప్రయాణించి తర్వాత ముళ్లపొదలు దాటుకుంటూ.. గోడ దూకి లోపలికి వెళ్లారు. అయితే.. పోలీసులు ఆయన్ను గమనించి అదుపులోకి తీసుకున్నారు.