ఇంద్రవెల్లి వేదికగా కేసీఆర్ సర్కార్‌పై సమరశంఖాన్ని పూరించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గులాబీ బాస్ చెవులు చిల్లులు పడేలా.. ఆయన శిష్యుల గుండెలు ఉలిక్కిపడేలా.. దళిత, గిరిజన దండోరాను మోగించారు. దళిత ముఖ్యమంత్రి హామీ మొదలు..దళిత బంధు వరకు ఏడేళ్లుగా కేసీఆర్ సర్కార్ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను చీల్చిచెండాడారు. అక్షరాలా లక్షలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ కేడర్‌కు.. పీసీసీ చీఫ్ హోదాలో తొలిసారిగా కర్తవ్య బోధ చేశారు. ప్రసంగం ఆద్యంతం ఒక్కో మాటను తూటాలా పేలుస్తూ.. హస్తం శ్రేణుల్లో ఆక్సిజన్‌ను నింపారు. మరో సమరానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ అడవుల్లో ప్రవహించే గోదావరి.. ఉప్పెనై ఇంద్రవెల్లిని కమ్మేసినట్టుగా అనిపిస్తోందంటూ పదునైన వ్యాఖ్యలతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి. చివరిదాకా అదే టెంపో, టెంపర్‌మెంట్‌ను చూపించారు. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే, ఆ గాలిని పిలిస్తే రక్తం సలసలా మరుగుతుందన్న రేవంత్ రెడ్డి.. నిజాం నవాబుకు గోల్కోండ కోట కింద ఘోరీ కడతానన్న కొమరం భీం మాటలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. 4 కోట్ల తెలంగాణ బిడ్డల భవిష్యత్ దొర గడిలో బందీ అయిందని.. అందుకే ఇంద్రవెల్లి నుంచే పోరాటం మొదలుపెడుతున్నామని స్పష్టం చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచే బాధ్యత తమదేనని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమరులైన ఆదివాసీ బిడ్డల పేర్లను స్మారక స్థూపం శిలాఫలకంపై లిఖిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని, లేదంటే తల నరుక్కుంటానని కేసీఆర్ చెప్పిన మాటలని గుర్తు చేసిన ఆయన.. దళితుడు కాదు ఓ దరిద్రుడు ఆ పదవిలో ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంచె కట్టుకున్న దళితుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం చూసి ఓర్వలేక, అవినీతి ముద్రవేసి బయటకు పంపించారని ఆరోపించారు. ఆ దళిత బిడ్డ చేసిన తప్పేమిటో ఇప్పటికీ కేసీఆర్ ఎందుకు చెప్పడంలేదని నిలదీశారు. మాదిగలకు మంత్రి వర్గంలో స్థానమే కల్పించలేదని.. తొలి ప్రభుత్వంలో మహిళలను అసలు పట్టించుకోనేలేదని విమర్శించారు. ఇంద్రవెల్లి సభకు అధ్యక్షతను వహించింది ఓ మహిళ అని సీతక్కను చూపిస్తూ.. కాంగ్రెస్ ఆమెకు అంత గౌరవమైన హోదాను కల్పించిందని చెప్పారు.
కాంగ్రెస్ దళితులకు ఏం చేసిందని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని.. దళితులైన కేఆర్ నారాయణ్ను రాష్ట్రపతిని చేసింది.. మీరాకుమారిని లోక్సభ స్పీకర్గా చేసింది.. సుశీల్ కుమార్ షిండేని కేంద్ర హోంశాఖ మంత్రిగా చేసిందని గుర్తు చేశారు. ఇంద్రవెల్లి వేదికపై కూర్చున్న దళిత నేతల్లో కూడా చాలా మంది మంత్రులైనవారేనంటూ దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి వంటి వారిని చూపించారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నేతలపై సెటైర్లు కురిపించారు రేవంత్ రెడ్డి. ఒకరేమో జోకుడు రామన్న.. మరొకరేమో గుడిని మింగే ఇంద్రకరణ్ రెడ్డి.. ఇంకొకరేమో బానిస బాల్కసుమన్ అంటూ ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ పేరుతో బాల్క సుమన్ ఎమ్మెల్యే, ఎంపీ అయ్యారంటే.. అది కాంగ్రెస్ పుణ్యమేనని హితవు పలికారు.
కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీల జీవితాలు చితికిపోతున్నాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు ఎస్సీలు గుర్తుకొస్తారని మండిపడ్డారు. దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని నిలదీశారు. 119 నియోజవర్గాల్లో ఉప ఎన్నికలు రావాలని.. అప్పుడే నిధులు ఇచ్చేలా ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను దళితుణ్ణి కాకపోవచ్చు కానీ.. నల్లమల్ల అడవిలో పుట్టిన బిడ్డనని.. చెంచుల కష్టాలను కళ్లారా చూసినవాడినని చెప్పారు. ఆదివాసీల జీవితాలు మార్చాలనేదే కాంగ్రెస్ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
ఇక కేసీఆర్ నరరూప రాక్షసుడిగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. బిడ్డను బిర్లాను.. కొడుకును అంబానిని.. అల్లుడిని టాటాను చేశారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాత్రం తాగి ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇంకో 22 నెలలు మాత్రమే ఫామ్ హౌస్లో ఉంటారని… ఆ తర్వాత చర్లపల్లి జైలులోనే గడపాల్సి ఉంటుందని చెప్పారు.
మరోవైపు ఇంద్రవెల్లి సభ సందర్భంగా పోలీసులు వ్యవహరించి తీరుపై కూడా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సభకు వచ్చే వారిని 12 కిలోమీటర్ల దూరంలో ఆపారని.. ఇదెక్కడి న్యాయమో చెప్పాలని నిలదీశారు. కొందరు పోలీసులు కేసీఆర్కు కట్టు బానిసలుగా మారిపోయారని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావును ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రభాకర్ రావు ఎక్కడ ఉన్నా.. ఇంద్రవెల్లికి తీసుకొచ్చి వంగోబెడతామని హెచ్చరించారు. నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. లక్షకు ఒక్కరు తగ్గినా తల వంచుతా ..మీ ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక తెప్పించుకో అంటూ ఛాలెంజ్ చేశారు.