తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు అడగడమే నేరమైందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ బర్త్ డే వేడుకలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు ఆయన పిలుపునివ్వడంతో గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి గోల్కొండ పీఎస్ కు తరలించారు. సాయంత్రానికి వదిలిపెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు మీడియాతో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఇకపై ఫిబ్రవరి 17ను నిరుద్యోగ దినంగా జరుపుతామని తెలిపారు రేవంత్. ప్రముఖులు చనిపోతే సంతాప దినాలు జరుపుతారు.. బతికి ఉన్నాక కేసీఆర్ మూడు రోజులు జన్మదిన వేడుకలు జరపడమేంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే నక్సల్స్ ఉంటేనే బాగుండని అనిపిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. అటెండర్ నుండి ఐఏఎస్ వరకు నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పారు.
తెలంగాణ వచ్చాక కూడా నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్. ప్రత్యేక రాష్ట్రం వస్తే.. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ చెప్పారని.. ఎనిమిదేళ్లేగా నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని తెలిపారు. పీజీలు చదివినవారు.. హమాలీలుగా మారారని అన్నారు. కేసీఆర్ కుటుంబ నేతలు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకుని.. వందలాది ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై టీఆర్ఎస్ నేతల పాశవిక దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు రేవంత్. పోలీసులు ప్రభుత్వ నేతలకు బానిస బతుకులు బతుకుతున్నారని ఆరోపించారు. అసలు.. మహేందర్ రెడ్డికి సిగ్గులేదని.. చేతగాని డీజీపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బానిస అధికారుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
ఇక అరెస్ట్ సమయంలోనూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయించి.. కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏంటని ప్రశ్నించడమే తామ చేసిన పాపమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని ప్రశ్నించారు రేవంత్. అలాగే.. కేసీఆర్ జన్మదినం.. నిరుద్యోగుల కర్మదినంగా మారిందని అన్నారు. సీఎం బర్త్ డే ఉత్సవాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు మద్ధతుగా, మెగా నోటిఫికేషన్ డిమాండ్ తో అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని సూచించారు.