కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఇల్లు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ స్వతహాగా ముసలోడిని అయ్యానని చెబుతున్నారు కాబట్టి తమ నినాదం బై బై కేసీఆర్ అని చెప్పారు. ఆయన ఫాంహౌస్ లోనే శేషజీవితం గడపాలని సొంత పార్టీ నేతలే కోరుకుంటున్నారని విమర్శించారు.
పబ్లిక్ మీటింగ్ లలో కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ కామెంట్ చేయడం వెనుక ఇదే కారణమని అన్నారు రేవంత్. భూపాలపల్లి లో 144 సెక్షన్ పెట్టడం.. స్థానిక ఎమ్మెల్యే కుట్రలు, అక్రమాలు, భూకబ్జా, మట్టి తవ్వకాలు లాంటివి బయటపడకుండా ఉండేందుకే అని ఆరోపించారు. కేసీఆర్ కు బై బై చెప్పి, కాంగ్రెస్ కు స్వాగతం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇటు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గండిపల్లి ప్రాజెక్టును రేవంత్ రెడ్డి సందర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. స్వరాష్ట్రంలోనూ గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టులను స్వయంగా సందర్శించిన కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చొని పూర్తి చేయిస్తానని చెప్పి గాలికి వదిలేశారని విమర్శలు చేశారు.
గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, పూర్తి చేసేది కూడా తమ పార్టీనే అని చెప్పారు రేవంత్. కాంగ్రెస్ హయాంలో 70 శాతం పూర్తి అయిన ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్యాకేజ్ లు ఇవ్వకుండా నిర్వాసితుల గోసకు కారణం అయ్యారని మండిపడ్డారు. పరిహారం అడిగితే నిర్వాసితులను జైలుకు పంపుతున్నారని ఫైరయ్యారు.
అంతకుముందు సైదాపుర్ మండలం సర్వాయిపేటలోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కోటను సందర్శించారు. ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గంలో రేవంత్ పాదయాత్ర కొనసాగుతోంది. గురువారం కట్కూర్ క్రాస్ నుంచి హుస్నాబాద్ వరకు యాత్ర కొనసాగించనున్నారు టీపీసీసీ చీఫ్.