– డిచ్ పల్లిలో రేవంత్ హాత్ సే హాత్ యాత్ర
– మంచిప్ప రిజర్వాయర్ ప్యాకేజ్ పనుల పరిశీలన
– రేవంత్ కు తమ గోడు వినిపించిన నిర్వాసితులు
– అరెస్టులపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం
– వెంటనే రీడిజైన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్
కాంగ్రెస్ లో సీనియర్లు అమ్ముడుపోయారని తాను అన్నట్టుగా వస్తున్న వార్తలను ఖండించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం నిజామాబాద్ డిచ్ పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిప్ప రిజర్వాయర్ ప్యాకేజ్ 21, 22 పనులను పరిశీలించారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా.. తాను అనని మాటలను అన్నట్టుగా వార్తలు రావడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రీడిజైన్ తో పది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. 1.5 టీఎంసీ నుంచి 3.5 టీఎంసీకి పెంచడాన్ని వ్యతిరేకిస్తున్న బాధిత గ్రామాలు.. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా పనులు ప్రారంభించారని రేవంత్ కు వివరించారు. అడ్డుకున్న వారిపై హత్యాయత్నం కేసులు పెట్టి రిమాండ్ కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. రీడిజైన్ ప్లాన్ రద్దు చేసి పాత ప్లాన్ ప్రకారమే పనులు చేయాలని డిమాండ్ చేశారు.
జలయజ్ఞంలో భాగంగా వైఎస్ హయంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ చేపట్టిందని గుర్తు చేశారు రేవంత్. ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టి ఆయన గొప్పతనాన్ని చాటాలని అనుకుందన్నారు. 900 కోట్లకు పైగా ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేస్తే.. ఈ తొమ్మిదేళ్లలో 21వ ప్యాకేజ్ పనులు పూర్తి కాలేదు సరికదా కేసీఆర్ స్వార్ధానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ లు బలయ్యాయని విమర్శించారు.
కొండెం చెరువు కెపాసిటీ 0.84 టీఎంసీ సామర్థ్యంలో ఈ ప్రాంతంలో పేదల భూములు ముంపునకు గురవుతాయని ఉన్నదాంట్లోనే లక్ష 83వేల ఎకరాకు నీరివ్వాలని కాంగ్రెస్ అనుకుందని వివరించారు రేవంత్. ఇంకో 300కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి సాగు నీరు అందేదన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరం సాగు విస్తీర్ణం పెరగకున్న ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3500 కోట్లకు పెంచారని ఆరోపించారు. కొత్తగా రీడిజైన్ వలన భూసేకరణతో 10గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఆయకట్టు పెరగకపోయినా పేదలను భూ నిర్వాసితులను చేశారని మండిపడ్డారు.
భూములు కోల్పోయిన రైతులు నిరసన తెలిపితే 307 సేక్షన్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కేసులను బే షరతుగా ఉపసంహరించుకుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్యాకేజ్ రీడిజైన్ ను వెనక్కు తీసుకుని.. పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి.