మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. మేడారం జాతరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాల్సిందేనని.. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదే శ్‌లో జరిగే కుంభమేళాకు ఇచ్చే ప్రాధాన్యం ఆదివాసీల పండుగకు ఇవ్వరా అని ప్రశ్నించారు రేవంత్. సమ్మక్క, సారలమ్మ జాతర వైపు సీఎం కేసీఆర్ కన్నెత్తి చూడలేదని విమర్శించారు. ముచ్చింతల్ దర్శనానికి ప్రధాని, సీఎం వెళ్తారు కానీ.. సమ్మక్క, సారలమ్మను మాత్రం అవమానిస్తారా అంటూ మండిపడ్డారు.
ములుగు జిల్లాకు సమ్మక్క, సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అలాగే శాశ్వత పర్యాటక కేంద్రంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలన్నారు. మేడారం జాతరకు కేంద్రం కేటాయించిన రూ. 2.5 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీలో గతంలో భిన్నాభిప్రాయాలకు చోటు ఉండేదని.. మోడీ వచ్చిన తర్వాత ఏక వ్యక్తి పార్టీగా మారిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ కూడా అలాగే ఉందని విమర్శలు చేశారు.
కాంగ్రెస్ నిరసన కార్యక్రమాల్లో అధికార పార్టీ ఎంత దారుణంగా ప్రవర్తించిందో అంతా చూశారన్నారు రేవంత్. తనను అరెస్ట్ చేయడం, కార్యకర్తలను కొట్టడంతో.. కోపం, ఆవేశంతో కొంత పరుషమైన పదజాలం వాడానని.. భవిష్యత్తులో వీలైనంత మేర తగ్గిస్తామని తెలిపారు.