– రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు…
– టీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్యలు
– ఇది మానవత్వం లేని రాక్షస పాలనకు నిదర్శనం
– రాబోయేది మా ప్రభుత్వమే.. రేవంత్ జోస్యం
జీవో 317ను రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పర్యటనలో భాగంగా 317 జీవో కారణంగా మనస్థాపానికి గురై చనిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు రేవంత్. రాష్ట్రంలో మానవత్వం లేని రాక్షస పాలన నడుస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. 317 జీవోను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ సమస్యను జఠిలం చేసి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నట్లు ఆరోపించారు రేవంత్. పార్లమెంట్ లో కూడా జీవో 317పై పోరాటం చేస్తామన్నారు. చనిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలను ఆదుకోవాలని.. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కూడా సహాయం అందించే బాధ్యత బీజేపీ తీసుకోవాలని చెప్పారు.
రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు రేవంత్. పర్వతగిరిలో మిర్చి రైతు సంపత్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఈ ఏడాది మిర్చి పంటకు తామర తెగులు సోకి లక్షల ఎకరాల పంట నాశనమైందన్నారు. పంట పెట్టుబడి కోసం లక్షల రూపాయలు అప్పులు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల బృందం పర్యటన తప్ప సమస్యకు పరిష్కారం చూపలేదని ఆరోపించారు రేవంత్. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై తక్షణం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ఇష్టపడి ఎంచుకున్న ప్రభుత్వం వారి మరణానికి కారణం అవుతుందన్నారు రేవంత్. మిర్చి పంట మొత్తం దెబ్బతిన్నా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొవడం లేదని మండిపడ్డారు. రైతులకు భరోసా ఇవ్వకపోవడంతోనే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ కలిసి 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నాయన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ సోనియమ్మ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు రేవంత్.