కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఢిల్లీ జంతర్ మంతర్ లో తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ జంగ్ సైరన్ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీసీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. జనగణనలో బీసీలను కులాల వారీగా లెక్క తేల్చాలంటూ డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు మద్దతు తెలిపారు రేవంత్ రెడ్డి.
ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు బీసీల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు రేవంత్. జంతర్ మంతర్ లో బీసీలు ధర్నా చేస్తుంటే 9 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అంటే బడుగు బలహీన వర్గాల ద్వారా కాదా? అంటూ ప్రశ్నించారు. బీసీలను కులాల వారీగా లెక్కించడం వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో బీసీ కులాల లెక్కలు చేపట్టిందని… కాంగ్రెస్ ఓడిపోవడంతో తర్వాత అది సాధ్యం కాలేదని వివరించారు.
దేశ ప్రధాని బీసీనే అయినా కూడా ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు రేవంత్. బలహీన వర్గాల మద్దతు లేకుండా బీజేపీ అధికారంలోకి వచ్చిందా? అంటూ నిలదీశారు. మోడీ ప్రధాని అయ్యాక బీసీల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల జనాభా లెక్క పెడతామన్న ఆయన.. ఈ అంశంపై పార్లమెంటులో పోరాడతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీ వెంటే ఉంటుందని భరోసా కల్పించారు రేవంత్.