తెలంగాణను బార్లు, బీర్ల తెలంగాణగా మార్చారని కేసీఆర్ పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో సర్కార్ పై ప్రతిపక్షాలు తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాయి. రాష్ట్రంలో మందుబాబుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని చెబుతుంటాయి. తాజాగా ఓ యువకుడు చేసిన పని మద్యం ఏరులై పారుతోందనడానికి నిదర్శనంగా ఉందని అంటున్నాయి.
హైదరాబాద్ లో సోమవారం రాత్రి ఓ యువకుడు నానా హంగామా సృష్టించాడు. ఏకంగా పోలీస్ కారుపైకి ఎక్కాడు. అద్దాలను ధ్వంసం చేశాడు. అర్ధ నగ్నంగా ఉన్న ఆ యువకుడు నడుస్తున్న పోలీస్ కారు పైకెక్కి సైరన్ లైట్లపై కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదికాస్తా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ కంటపడడంతో.. ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్
‘‘ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే… ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసి, అద్దాలు ధ్వంసం చేశారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చింది. ఈ నగరాన్ని… ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా!? పౌర సమాజం ఆలోచన చెయ్యాలి”
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి మద్యంపై వస్తున్న ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని.. అందుకే ఇలా తయారవుతున్నారని విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు.