కరోనా సమయంలో రైతులను ఆదుకొని, రైతుల పంటను కొనుగోలు చేసి గిట్టుబాటు ధరను కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరసన దీక్షకు దిగిన ఉత్తమ్… సోనియా పిలుపు మేరకు వలస కార్మికుల చార్జీ డబ్బులను చెల్లిస్తామన్నారు.
పీఎం కేర్, సీఎం కేర్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ వలస కూలీల వద్ద చార్జీలు వసూలు చేయటం దుర్మార్గమని, ప్రభుత్వాలు ఇవ్వలేని ఉచిత ప్రయాణాన్ని తాము కల్పిస్తామన్నారు. ఇన్నాళ్లు లెక్కలు లేకుండా వలస కూలీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారని ఉత్తమ్ ప్రశ్నించారు. వలస కార్మికులకు భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని, వారంతా వెళ్లిపోతే నిర్మాణ రంగం కుంటుపడుతుందన్నారు ఉత్తమ్.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, బస్తాలు.. సంచులు ఇవ్వకపోవటం వల్లే ధాన్యం తడిసిందని ఆరోపించారు ఉత్తమ్. వైన్ షాపుల విషయంలో అత్యుత్సాహాం వద్దని, ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని 85శాతం మంది తినటం లేదని, సన్నబియ్యం ఇస్తే బాగుండేదని ఉత్తమ్ అన్నారు. బత్తాయి రైతుల అవస్థలకు కేసీఆరే కారణమని, పేదలకు ప్రభుత్వం 5వేల సహాయం చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
ఉత్తమ్ చేపట్టిన దీక్షకు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డితో పాటు పలువురు నేతలు మద్దతు పలికారు.