హైదరాబాద్ లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ ప్రాంతంలో సూర్యుడు మంట పుట్టిస్తుంటే.. ఇంకోచోట భారీ వర్షం పడుతోంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదని.. బుధవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఇవాళ ఉదయం 11 దాకా కుంభవష్టి వానలు ఉంటాయని తెలిపింది.
వాతావరణశాఖ హెచ్చరికతో.. ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ ప్రజలకు కీలక సూచన చేశారు. ఉదయం 12 గంటల దాకా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు పడటం వల్ల వరద నీటితో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రోడ్లపై చేరే వరద నీరు వెళ్లేందుకు కనీసం గంట సమయం పడుతుందని.. కనుక వర్షం తగ్గిన గంట తర్వాత ప్రజలు బయటకు రావాలని సూచించారు.
వరదలు ఎక్కువగా ఉండే రూట్లలో ప్రయాణించకుండా వాహనాదారులు ఇతర మార్గాల్లో ప్రయాణించేలా చూసుకోవాలని తెలిపారు పోలీసులు. ఉదయం 9 గంటల ప్రాంతంలో భారీ వర్షం పడింది. సికింద్రాబాద్, పంజాగుట్ట, గోల్కొండ, మెహదీపట్నం, కార్వాన్, నారాయణగూడ, హిమాయత్ నగర్ సహా కొన్ని ఏరియాల్లో కుండపోత వర్షం కురిసింది. అత్తాపూర్, ఉప్పరపల్లి, హైదర్ గూడ, ఆదిభట్లలోనూ భారీ వర్షం పడింది.
Advertisements
వర్షానికి రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. పిల్లలు స్కూల్ కు వెళ్లే సమయం కావడంతో అందరూ ఇబ్బంది పడ్డారు. జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వర్షపు నీటిని మళ్లించారు. నీటిలో వాహనాలు నెమ్మదిగా కదలడంతో పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి.