గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో పండుగ వాతావరణం నెలకొంది. గల్లీగల్లీలో గణనాథులు దర్శనమిస్తున్నారు. ఇక ప్రతి భక్తుడు దర్శించుకోవాలనుకునే ఖైరతాబాద్‌లో ఈసారి పంచముఖ రుద్ర గణపతి కొలువయ్యాడు. ఈ భారీ వినాయకుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలు భక్తులు తరలి వస్తున్నారు.
భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఖైరతాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణేశ్ ఉత్సవాల దృష్ట్యా ఈనెల 19 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. ఖైరాతాబాద్ వినాయకుని దర్శనానికి వచ్చే భక్తులు సొంత వాహనాల్లో రావద్దని, మెట్రో లేదా ఎంఎంటీఎస్ లో రావాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, నడవలేనివారికి మింట్ కాంపౌండ్‌లో సొంత వెహికిల్స్ పార్కింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఖైరతాబాద్ ప్రధాన రహదారిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు.
గతేడాది కరోనా ఆంక్షల కారణంగా భక్తులంతా ఇంటికే పరిమితం కాగా… ఈసారి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి భావిస్తోంది. దీంతో కరోనా నిబంధనలకు అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేశారు.