టార్గెట్ రీచ్ అవ్వాలన్న తపనతో ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోంది. ఎక్కడపడితే అక్కడ కాపు కాయడం.. వాహనదారులకు చలాన్లు వేయడం.. జేబు ఖాళీ చేయడం రోజువారీ తంతుగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. ఓ చిన్నారిని బలి తీసుకుంది.
బాధితుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన దంపతులు తమ మూడు మాసాల చిన్నారిని చికిత్స కోసం అద్దె కారులో హైదరాబాద్ తీసుకొస్తున్నారు. కారు యాదాద్రి జిల్లాలోకి ప్రవేశించింది. వంగపల్లి దగ్గర ట్రాఫిక్ పోలీసులు కారును నిలిపివేశారు. డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోలేదని పెండింగ్ చలాన్లు చెక్ చేశారు. రూ.1000 పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. ఆ సొమ్ము కడితేనే కారు ముందుకు కదులుతుందని చెప్పారు.
చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉందని కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని చెబుతున్నారు. దాదాపు అరగంట సేపు డ్రైవర్ తో పోలీసులు వాగ్వాదానికి దిగారని.. ఆలస్యం కావడంతో తమ బిడ్డ చనిపోయిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయంటూ ఆరోపిస్తున్నారు. నీలోఫర్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స ప్రారంభించే సమయంలో చిన్నారి మరణించినట్టుగా డాక్టర్లు చెప్పినట్లు వివరించారు. కనీసం 10 నిమిషాల ముందు తీసుకొచ్చినా బతికేదని చెప్పారన్నారు. అయితే.. పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. కారులో చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉందని చెప్పలేదని వారు అంటున్నారు.
ఈమధ్య పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ మరిచిపోయి.. రహదారుల మధ్యలో ట్యాబులు పట్టుకుని వాహనాల ముందు, వెనుక పరుగులు తీయడం ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనల పేరుతో వేధిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో కూడా ఇదే తంతు కొనసాగుతోందని చెబుతున్నారు. టార్గెట్ అయిపోగానే రోడ్లపై కనిపించరని అంటున్నారు. ఆఖరికి సిగ్నల్స్ దగ్గర ఆగిన వాహనాలను కూడా వదలడం లేదని చెబుతున్నారు. వీఐపీ జోన్లలో మీడియా ప్రతినిధులతోనూ వాగ్వాదానికి దిగుతున్నారు. తిరిగి పైఅధికారులకు వారు ర్యాష్ గా మాట్లాడారంటూ తప్పుడు సమాచారం ఇస్తున్నారని సమాచారం.