శనివారం కావడంతో యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో రద్దీ అధికంగా ఉంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం.. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టేలా భక్తులు వచ్చారు.
ఈనెల 10 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండడంతో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు రెండు, మూడు రోజులుగా తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శనివారం కూడా భారీ సంఖ్యలో వాహనాలపై భక్తులు రావడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి.
అయితే, రూ.500 పార్కింగ్ వసూలు కోసం ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేశారని ఆలయ అధికారులపై మండిపడ్డారు భక్తులు. ఫైన్లు రాసేందుకు ఉత్సాహం చూపే పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా చోద్యం చూశారని ఆరోపించారు. కొండపైకి భక్తులకు కావలసినన్ని బస్సులు ఉచితంగా నడిపిస్తామని చెప్పి.. ఆటోలను నిరాకరించి వారి పొట్టకొట్టిన ఆలయ ఈఓ గీతారెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
కొండపైకి 8 బస్సులకే కుదించిన ఈఓ.. భక్తులు ప్రతీరోజు పడిగాపులు కాస్తూ బస్సు రాగానే పరుగులు తీస్తోంది కనిపించడం లేదా? అని నిలదీశారు. కొంతమంది ఏమీ చేయలేక తమ వాహనంతో కొండపైకి వెళ్దామనుకుంటే 500 రూపాయల రుసుం వసూలు చేస్తున్నారని.. ఇంత నిలువు దోపిడీ ఎందుకని ప్రశ్నించారు భక్తులు.