కేసీఆర్ జాతీయ పార్టీ నేపథ్యంలో తెలంగాణ భవన్ పరిసరాల్లో హడావుడి కనిపిస్తోంది. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా పార్టీ నేతలు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
సమావేశానికి సీఎం కేసీఆర్ తో పాటు ఇతర రాష్ట్రాల నేతలు హాజరవడంతో.. ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే, ఈ చర్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడంతో వేరే రూట్లు చూసుకుంటున్నారు.
ఎన్టీఆర్ భవన్, అపోలో ఆసుపత్రి, ఫిలింనగర్ నుంచి వచ్చే వాహనాలను… జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, 36 మీదుగా మళ్లిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 మీదుగా వాహనదారుల రాకపోకలు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
మాసబ్ ట్యాంక్ నుంచి రోడ్ నెంబర్ 12 వైపు వచ్చే వాహనాలను.. రోడ్ నెంబర్ 1, 10 మీదుగా జహీర్‌నగర్ నుంచి ఎన్టీఆర్ భవన్ మీదగా మళ్లిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. వాహనదారులు తమకు సహకరించాలని కోరుతున్నారు.