సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బిజెపి నిర్వహిస్తున్న విజయసంకల్ప సభకు… పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. స్పెషల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు గ్రౌండ్ చుట్టుపక్కలా నిఘా కట్టుదిట్టం చేశారు. బిజెపి అగ్రనేతలు, జాతీయ, రాష్ట్ర నాయకులు సభకు హాజరవుతుండడంతో పోలీసులు పకడ్బందీగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సభ పరిసరాల్లో సుమారు 3 వేల మంది పోలీసులతో భద్రతలో నిమగ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు. మరోవైపు ప్రధాని భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్పీజీ అధికారులతో… హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నోవాటెల్‌లో ప్రధాని బస, పరేడ్ మైదానంలో బహిరంగ సభ, రాజ్‌భవన్‌లో ప్రధాని బస అంశాలపై చర్చించినట్లు సమాచారం.
విజయ సంకల్ప సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. HICC, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రాజ్ భవన్, పంజాగుట్ట, బేగంపేట్ ఎయిర్‌పోర్ట్, ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఎన్డీ రోడ్, పరేడ్ గ్రౌండ్ తదితర ప్రాంతాల వైపు వాహనదారులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సీపీ ఆనంద్ కోరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే విజయ సంకల్ప సభ నేపథ్యంలో మొత్తం 7 గేట్లు ఉండగా, రెండు, మూడు గేట్లు మినహా మిగతా గేట్ల నుంచి ప్రజలను అనుమతించనున్నారు.
సభకు ఆటంకం కలగకుండా టివోలీ క్రాస్ రోడ్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్ మధ్య రహదారి మూసివేయనున్నారు. దాంతో చిలకలగూడ, అలుగడ్డబాయి, సంగీత్, YCMA, ప్యాట్నీ, SBH క్రాస్ రోడ్లు, ప్లాజా, సీటీఓ జంక్షన్, బ్రూక్ బాండ్ జంక్షన్, స్వీకా రాప్కార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి క్రాస్ రోడ్, బేగంపేట్, ప్యారడైజ్ ప్రాంతాల వైపు రాకుండా వాహనదారులు ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు.
ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయం నుంచి బహిరంగ సభకు చేరుకునే మార్గంలో… వెయ్యిమంది పోలీసులను ప్రత్యేకంగా నియమించారు. రూఫ్‌టాప్ బందోబస్తు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సీసీ కెమెరాలు… ఇలా నాలుగంచెల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 10గంటల నుంచే…ఎస్పీజీ బృందాలు బహిరంగ సభ ప్రాంగణం, సభావేదికను తమ ఆధీనంలోని తీసుకున్నాయి. జాతీయ నాయకులు, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు , కేంద్రమంత్రులకు ప్రత్యేకంగా కేటాయించిన గ్యాలరీల వద్ద… భద్రత ఏర్పాట్లను పరిశీలించాయి. ప్రధాని 43గంటల పాటు హైదరాబాద్‌లో తొలిసారిగా ఉండనుండటంతో… రాజ్‌భవన్, నోవాటెల్, పరేడ్ మైదానం పరిసర ప్రాంతాలను… హైసెక్యూరిటీ జోన్లుగా పరిగణించి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.