ఒకేరక్తం పంచుకుని పుట్టారు.ఒకే తల్లి అనురాగాన్ని పంచుకుని పెరిగారు. మంచి చదువులు చదివి జీవితంలో పైకొచ్చారు. ఒకే రోజు జీవితాన్ని విడిచి వెళ్ళిపోయారు.అన్నదమ్ముల అనుబంధానికి అద్దంపట్టే ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జరిగింది.తమ్ముడు అకాల మరణం చెందడాన్ని తట్టుకోలేని అన్న బోరున విలపిస్తూ స్మశానంలోనే కుప్పకూలిపోయాడు.
కొన్ని గంటల తేడాలో ఇద్దరు అన్నదమ్ముల మరణంతో తల్లి దండ్రులకు తీరనిదుఃఖం మిగిలింది.. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బోగ నాగభూషణం దంపతులకు ముగ్గురు కొడుకులు.
పెద్ద కొడుకు సచిన్ కోరుట్ల పట్టణంలోని ఓ సహకార బ్యాంకులో ప్రైవేట్ ఉద్యోగి. రెండో కొడుకు శ్రీనివాస్(32) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. హైదరాబాద్‌లో శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు. మృత దేహా న్ని మరునాడు ఉదయం మెట్‌పల్లికి తీసుకువచ్చారు.
మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించేందుకు వెల్లుల్ల రోడ్డులోని స్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. తన తమ్ముడు ఇక రాడు.. రాలేడనే తీవ్ర ఆవేదనకు గురైన సచిన్ బోరున విలపిస్తూ స్మశానంలోనే కుప్పకూలాడు.
బంధుమిత్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఓ వైపు తమ్ముడి చితి కాలుతుండగానే మరోవైపు అన్న మృతి చెందడం పలువురి హృదయాలను కలిచివేసింది. అదే రోజు సాయంత్రం సచిన్ మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
సచిన్‌కు భార్య ఉండగా, శ్రీనివాస్‌కు భార్య, 15 నెలల కూతురు ఉన్నారు. ఎదిగిన ఇద్దరి కొడుకులు తమ కళ్లెదుటే కానరాని లోకానికి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విలపించిన తీరు స్థానికులను కలిచి వేసింది.