ధరల పెరుగుదలతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఏ వస్తువును ముట్టుకున్న ధరల షాక్ కొడుతోంది. నిత్యవసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో బెంబేలెత్తున్నారు. ఈ క్రమంలో రైళ్ల టికెట్ల ధరలు రెట్టింపు కావటంతో సామాన్యుడిపై మోయలేని భారం పడినట్టయింది.
దేశంలోని దూర ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అందులోనూ ఏసీ బోగీల్లో వెళ్లటానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. పైగా వేసవి కాలం కావటంతో రెగ్యులర్ రైళ్లలో ఏసీ బోగీలు తక్కువగా ఉండటంతో ప్రీమియం రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. రాజధాని, దురంతో (కొన్ని స్లీపర్ మినహా), శతాబ్ది, హమ్‌సఫర్ వంటి రైళ్లలో ఉండేవన్నీ దాదాపుగా ఏసీ బోగీలే. వాటిలో వందలాది బెర్తులుంటాయి. అయితే ఈ రైళ్లలో టికెట్ ఛార్జీలు రెగ్యులర్ బండ్లతో పోలిస్తే దాదాపు రెండింతలు అధికంగా ఉంటున్నాయి. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో విమాన ఛార్జీలను సైతం అవి దాటిపోతున్నాయి.
రైల్లో రోజంతా ప్రయాణం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 2, 3 వారాల ముందు బుక్ చేసుకుంటే విమాన టికెట్ రూ.4,200 నుంచి రూ.5 వేలకు దొరుకుతుంది. అదే రాజధాని, దురంతో రైళ్లలో ఫస్ట్ ఏసీ టికెట్‌కు రూ.5,865 పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా విమాన ప్రయాణం అయితే 2 గంటలలో గమ్యస్థానానికి చేరుకుంటారు. అదే ప్రీమియం రైల్లో వెళితే ఏకంగా 22 గంటలు పడుతోంది. సరే అనుకుని.. అంత ఛార్జీ భరించినా చివరికి నిరీక్షణ తప్పటం లేదు.
ఈ క్రమంలో రాయితీల పునరుద్ధరణ ఉంటుందా..? అయితే ఎప్పుడు..? లేదంటే వాటిని ఎత్తేసినట్లేనా..? అన్న విషయంపై రైల్వేశాఖ స్పష్టతివ్వడం లేదు. “భారతీయ రైల్వేలో సుమారు 12లక్షల ఉద్యోగులు, 18 లక్షలమంది పింఛనుదారులు ఉన్నారు. జీతాలు, ఇతర ఖర్చులు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రైలు టికెట్లను అందరికీ 50శాతం రాయితీకి ఇస్తున్నాం. సీనియర్ సిటిజన్లు, ఇతరుల రాయితీ టికెట్ల పునరుద్ధరణ విషయం చూడాలి..” అంటూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.